Share News

Piyush Goyal: పసుపు రైతులకు మంచి రోజులు

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:11 AM

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.

Piyush Goyal: పసుపు రైతులకు మంచి రోజులు

  • బండి సంజయ్‌, అర్వింద్‌ పట్టుబట్టి బోర్డు సాధించారు: గోయెల్‌

  • నిజామాబాద్‌లో పసుపు బోర్డును వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/నిజామాబాద్‌, జనవరి15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని వాణిజ్యభవన్‌ నుంచి గోయెల్‌ పసుపు బోర్డు కార్యకలాపాలను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కేంద్రమంత్రి తో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, కరీంనగర్‌ నుంచి వర్చువల్‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయెల్‌ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ కోరిక మేరకు సంక్రాంతి రోజున పసుపు బోర్డును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బోర్డు ఏర్పాటు కోసం బండి సంజయ్‌, అర్వింద్‌ తీవ్ర ప్రయత్నాలు చేసి విజయం సాధించారన్నారు. కుంభమేళా రోజున బోర్డు ఏర్పా టు చేయడం రైతులకు కలిసి వస్తుందని పేర్కొ న్నారు. ఏపీ, తెలంగాణలో నాణ్యమైన పసుపును సాగు చేస్తున్నారని.. అందుకే పసుపు బోర్డును ఇక్క డ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పరిశోధనలు జరుగుతాయని.. కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. పసుపు ఉత్పత్తిలోనూ నాణ్యత పెరుగుతుందని.. సరైన గిట్టుబాటు కూడా వస్తుందని ఆయన చెప్పారు.


మోదీతోనే రైతులకు మేలు: సంజయ్‌

రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మోదీ ప్రభుత్వమేనని.. సంక్రాంతి రోజున పసుపు బోర్డు ఏర్పాటుతో మోదీ రైతులకు మేలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. నిజామాబాద్‌ ఎంపీలుగా గతంలో చాలా మంది పనిచేసినా అర్వింద్‌ ఒక్కరే బాండ్‌ పేపర్‌ మీద రాసిచ్చిన తన హామీని నెరవేర్చుకున్నారని చెప్పారు. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని ఎంపీ అర్వింద్‌ అన్నారు. లక్షలాది మంది పసుపు రైతుల కల నెరవేర్చిన ప్రధాని మోదీకి పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.


స్వాగతిస్తున్నాం: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌లో చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ ప్రాంతంలో పసుపు పంట బాగా పండుతున్నందున పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. రైతుల రెండు దశాబ్దాల పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. 2022లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ప్రధానికి లేఖ రాసినట్టు గుర్తు చేశారు. కాగా, సంప్రదాయ, పాత పద్ధతుల్లో పసుపు రైతులు వ్యవసాయం చేయటంవల్ల ఇబ్బందులు పడుతున్నారని, పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు, కూలీల కొరతను అధిగమించేందుకు ఆధునిక యంత్రాలు, పనిముట్లు రాయితీపై సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి.. వ్యవసాయ మంత్రి తుమ్మలకు బుధవారం లేఖ రాశారు.


రైతులకు మేలు: చిన్నారెడ్డి

పసుపు బోర్డును నిజామాబాద్‌ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షణీయమని, పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి అన్నారు. బోర్డు ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 03:11 AM