SLBC Tunnel: ఆశలు సన్నగిల్లి..
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:10 AM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్బీసీ) సొరంగం ప్రమాదం సంభవించి నిమిషాలు.. గంటలు.. రోజులు గడిచిపోతున్నాయి. లోపల చిక్కుకున్న ఆ ఎనిమిది మంది సిబ్బంది జాడ మాత్రం తెలియరావడం లేదు.

96 గంటలు గడిచినా అంతుచిక్కని సిబ్బంది ఆచూకీ
టన్నెల్‌లో పేరుకుపోయిన బురద.. ఉబికివస్తున్న ఊట
13.6 కి.మీ నుంచి 13.850 కి.మీ మధ్య మట్టి దిబ్బలే
వాటిని తొలగిస్తే మరో 50 మీటర్ల మేర
టన్నెల్ కూలే ప్రమాదం.. సెగ్మెంట్ బ్లాకులకు పగళ్లు
క్రాక్స్‌ను గుర్తించి, హెచ్చరించిన ర్యాట్ హోల్ మైనర్స్
మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూలు/దోమలపెంట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్బీసీ) సొరంగం ప్రమాదం సంభవించి నిమిషాలు.. గంటలు.. రోజులు గడిచిపోతున్నాయి. లోపల చిక్కుకున్న ఆ ఎనిమిది మంది సిబ్బంది జాడ మాత్రం తెలియరావడం లేదు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నా.. కూలిన మట్టిదిబ్బలు, పేరుకుపోయిన బురదకు తోడు భారీగా ఉబికి వస్తున్న నీటితో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గంటలు గడుస్తున్నకొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రమాదం జరిగి.. సిబ్బంది లోపల చిక్కుకుపోయి మూడు రోజులు గడిచిపోయాయి. సహాయక చర్యలు ఫలిస్తాయని గానీ, చిక్కుకుపోయిన వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయని గానీ సహాయక బృందాలే గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందునా.. సిబ్బంది చిక్కుకుపోయిన చోట 40 మీటర్ల పరిధిలో మట్టిదిబ్బలు కూలే పరిస్థితులు ఏర్పడటం.. లోపల పేరుకుపోయిన మట్టిదిబ్బలను తొలగిస్తే మరో 50 మీటర్ల మేర టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట శివారులో ఉన్న ఈ ప్రాజెక్టులో శనివారం ఉదయం సొరంగం పైకప్పు కూలిన ఘటనలో పనుల్లో ఉన్న ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు కలిపి మొత్తం ఎనిమింది టన్నెల్ లోపల గల్లంతయ్యారు.
శ్రీశైలం జలాశయం వైపు నుంచి సొరంగం మొదలై పనులు జరుగుతున్న 13.8 కి.మీ వద్ద టన్నెల్ కూలింది. అక్కడే ఈ ఎనిమిది మంది చిక్కుకుపోయారు. 13.6 కి.మీ నుంచి 13.850 కి.మీ వరకు.. దాదాపు 250 మీటర్ల మేర ఎక్కడికక్కడ మట్టిదిబ్బలు కూలిపోయాయి. 15 ఫీట్లు, 10 వేల క్యూబిక్ మీటర్లలో బురద, వ్యర్థాలు పేరుకుపోయాయి. 4వేల నుంచి 5వేల లీటర్ల దాకా నీరు ఉబికి వస్తోంది. ఇవన్నీ సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయి. శనివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు 10 దఫాలుగా సహాయక బృందాలు లోపలికి వెళ్లినా పేరుకుపోయిన బురద, వెల్లువలా ఉబికివస్తున్న నీరు కారణంగా ముందుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వెనక్కి వచ్చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వివిధ ఏజెన్సీలకు చెందిన 52 మంది సొరంగం లోపలికి వెళ్లి సాయంత్రం 5:30 గంటలకు బయటకొచ్చారు. ఆ తర్వాత మరో బృందం టన్నెల్‌లోకి వెళ్లింది. సోమవారంతో పోల్చితే కొంత ఇనుప వ్యర్థాలను పక్కకు జరిపినట్లు తెలుస్తోంది. సిబ్బంది చిక్కుకుపోయిన 13.8 కి.మీ పాయింటు నుంచి 40 మీటర్ల పరిధి వరకు ప్రదేశం చాలా సున్నితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ 40 మీటర్ల పరిధిని త్వరగా క్లియర్ చేసేందుకు తొలుత ప్రొక్లెయిన్‌లను ఉపయోగించాలని నిర్ణయించినప్పటికీ మరింత నష్టం జరిగే అవకాశాలుంటాయని, సహాయక బృందాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాలుంటాయని కంపెనీ ప్రతినిధులు హెచ్చరించారు. ఫలితంగా కన్వేయర్ బెల్టు ద్వారానే బురదను తరలించాలని నిర్ణయించారు. అయితే ప్రమాద తీవ్రతకు దాదాపు రెండు కి.మీ మేర కన్వేయర్ బెల్టు దెబ్బతింది. దీన్ని మరమ్మతులను మంగళవారం ప్రారంభించారు. బుధవారం ఉదయం వరకు కన్వేయర్ బెల్టును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కన్వేయర్ బెల్టు అందుబాటులోకి వస్తే గంటకు 800 క్యూబిక్ మీటర్ల బురదను క్లియర్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రొక్లెయిన్ వెళ్లేందుకు అనువుగా ఐరన్ వ్యర్థాలను తొలగిస్తున్నారు. తర్వాత ప్రొక్లెయిన్‌ను ఉపయోగించి కన్వేయర్ బెల్టుతో బురదను బయటకు పంపిస్తారు. .
సెగ్మెంట్ బ్లాకులు కుంగి మట్టి దిబ్బలపై..
ఎస్‌ఎల్బీసీ టన్నెల్లో కూలిన మట్టిని తరలించే ప్రయత్నం చేస్తే పెను ప్రమాదం తప్పదని నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. సొరంగంలో నీటి ఊట, మట్టి, రాళ్లు కూలి పడిన నేపథ్యంలో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తే మరో 50 మీటర్ల దూరం టన్నెల్ కుప్పకూలే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. సెగ్మెంట్ బ్లాకులు కుంగి మట్టిదిబ్బలను ఆసరాగా చేసుకొని ఉన్నాయని అంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు స్నిఫర్ డాగ్స్‌తో ర్యాట్ హోల్ మైనర్స్ లోపలికి వెళ్లారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన 22 మంది సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎ్‌ఫకు చెందిన 52 మంది లోపలికి వెళ్లారు. ప్రత్యేకించి ర్యాట్ హోల్ మైనర్స్ టన్నెల్‌లో కూలిన మట్టిదిబ్బల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సెగ్మెంట్ బ్లాకుల్లో ఏర్పడిన పగుళ్లను గుర్తించారు. దీంతో అది కూడా కూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెన్కకి వెళ్లాలంటూ తమను అనుసరించిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం ఎన్‌జీఆర్‌ఐ (నేషనల్ జియోలాజికల్ రీసర్చ్ ఆఫ్ ఇండియా), ఎన్‌ఆర్‌ఎ్‌స (నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో సహాయక చర్యలకు సంబంధించిన ప్రణాళిక చేయనున్నారు. ఈ బృందాల సభ్యులు లోపలకు వెళ్లి అక్కడ మట్టి నమూనాల ద్వారా సున్నిత ప్రదేశాలను నిర్దేశించడం, సాయిల్, ఖనిజాల పరిస్థితిని అంచనా వేయడం, రిమోట్ సెన్సింగ్ ద్వారా లోపల చిక్కుకున్న వారి జాడను కనుక్కోవడం వంటివి చేయనున్నారు. ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ (నేషనల్ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్) నుంచి నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు.ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ, నేవీ, సింగరేణి కలిపి 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటుడగా వీరికి బుధవారం నుంచి జీఎ్‌సఐ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఎ్‌స నుంచి మరికొంతమంది తోడవుతారు.