SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్.. బ్లాస్టింగ్!
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:01 AM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

సొరంగం తవ్వకాన్ని కొనసాగించేందుకు, ప్రస్తుత సహాయక చర్యలకు ఇదే విధానం
సీఎం రేవంత్‌కు అధికారుల ప్రతిపాదన
నిపుణుల కమిటీని నియమించి, కేంద్రం అనుమతి పొందాలన్న సీఎం
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సొరంగం తవ్వకం కొనసాగింపుతోపాటు ప్రస్తుతం టన్నెల్ ప్రమాదస్థలి వద్ద చేపడుతున్న సహాయక చర్యల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. సోమవారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వీటిని నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. ఈ సందర్భంగా ప్రమాదస్థలిలో నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని రెవెన్యూ (విపత్తు నిర్వహణ విభాగం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా.. ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 700 మంది సిబ్బంది ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు తెలిపారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
టన్నెల్‌లో ప్రమాదం జరిగిన నాటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీశైలం (ఇన్‌లెట్) నుంచి సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినందున.. గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా మారిందని సీఎంకు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్ల మేర ప్రదేశాన్ని అత్యంత ప్రమాదకర జోన్‌గా గుర్తించినట్లు నివేదించారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలుసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇన్‌లెట్ వైపు నుంచి టీబీఎంను పూర్తిగా తొలగిస్తున్నందున.. ఇకపై డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వకం చేపట్టడం ఉత్తమమని అధికారులు నివేదించగా.. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. ఒక ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ నివేదికతో కేంద్ర మంత్రిత్వశాఖల నుంచి డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానానికి అనుమతి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఏప్రిల్ 10 కల్లా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి..
టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఇప్పటికి ఒక్కరి మృతదేహం మాత్రమే లభ్యమైన నేపథ్యంలో.. మిగిలిన ఏడుగురి ఆచూకీ కనుగొనేందుకు ఎంత సమయం పడుతుందని సీఎం రేవంత్ ఆరా తీశారు. దీంతో ఏప్రిల్ 10వ తేదీ కల్లా రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌కు కూడా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానమే మేలు అని అధికారులు చెప్పగా.. వెంటనే నిపుణుల కమిటీని వేసి అనుమతులు సాధించాలని సీఎం అన్నారు. ఇదిలా ఉండగా.. ఇన్‌లెట్ టీబీఎంపైనే టన్నెల్ పైకప్పు కూలడంతో ఇప్పటికే అది దాదాపుగా ధ్వంసమయిందని అధికారులు తెలిపారు. దాని భాగాలను కట్ చేస్తున్నామని చెప్పారు. ఆ స్థానంలో కొత్త టీబీఎం కాకుండా ఇన్‌లెట్ వైపు పూర్తిగా సొరంగం తవ్వకానికి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని అన్నారు. ఔట్‌లెట్ వైపు మాత్రమే టీబీఎంకు త్వరలో బేరింగ్‌ను అమర్చి వినియోగించాలని నివేదించగా.. సీఎం అంగీకరించారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్జీఆర్‌ఐ, జీఎ్‌సఐ, సింగరేణి, హైడ్రా, ఫైర్ సర్వీసెస్ ప్రతినిధులు, ఎస్‌ఎల్బీసీ పనులు చేపడుతున్న కాంట్రాక్టు కంపెనీ జేపీ అసోసియేట్స్ ఎండీ పంకజ్‌గౌర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.