అదనపు రుణం రూ.1,474 కోట్లు
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:59 AM
రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.1,474 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం పాటల ద్వారా సేకరించే రుణాల్లో భాగంగా దీనిని సేకరించింది.

అంచనా కంటే ఎక్కువగా అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
బడ్జెట్ అంచనాల్లో మార్కెట్ రుణాలు రూ.57,112 కోట్లు
జనవరి నాటికి తీసుకున్న రుణం రూ.58,586 కోట్లు
రాష్ట్ర రాబడులు రూ.1,83,427 కోట్లు, వ్యయం రూ.1,78,947 కోట్లు
కాగ్ జనవరి నివేదిక
హైదరాబాద్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.1,474 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం పాటల ద్వారా సేకరించే రుణాల్లో భాగంగా దీనిని సేకరించింది. ఈసారి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ) పెరుగుతుందంటూ కేంద్ర ప్రభుత్వానికి వివరించి, ఈ అదనపు రుణం తీసుకుని ఉంటుందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. ఈమేరకు రాష్ట్ర ఆదాయ, వ్యయాలకు సంబంధించి ‘కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)’ బుధవారం జనవరి నెల నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసిన మార్కెట్ రుణాల కంటే అదనంగా రూ.1,474 కోట్లను అప్పుగా తీసుకున్నట్లు తేలింది. 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.57,122 కోట్ల మార్కెట్ రుణాలు తీసుకుంటామని అంచనా వేసింది. ఇవి కాకుండా జీఎ్‌సటీ పరిహారం కింద మరో రూ.3,900 కోట్ల రుణాన్ని రాష్ట్రానికి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇతర రుణాల కింద రూ.1000 కోట్లను తీసుకుంటామని రాష్ట్రం బడ్జెట్‌లో తెలిపింది. ఇలా మొత్తం రూ.62,012 కోట్ల రుణాలు వస్తాయని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.3,900 కోట్ల రుణాలకు మార్కెట్ రుణాలతో సంబంధం లేదు. అవి ఎలాంటి వడ్డీ లేని రుణాలు. 50 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసలు(ప్రిన్సిపల్) మొత్తాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.1000 కోట్లు రిజర్వు బ్యాంకు ద్వారా కాకుండా బడ్జెట్‌కు ఆవల తెచ్చుకునే రుణాలు. ఈ దృష్ట్యా మార్కెట్ రుణాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే రూ.57,112 కోట్ల అంచనాలకుగాను కేంద్ర ప్రభుత్వం రూ.49,255 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నాటికి రూ.58,586.64 కోట్ల మార్కెట్ రుణాలు తీసుకున్నట్లు ‘కాగ్’ వెల్లడించింది. ఇది 118 శాతమని తెలిపింది. బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.57,112 కోట్లను పరిగణలోకి తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,474 కోట్ల అప్పును అదనంగా తీసుకున్నట్లయింది. అయితే జీఎ్‌సడీపీ పెరుగుతుందన్న ధీమాతో, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ అదనపు రుణాలు తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
మొత్తం రాబడులు రూ.1,83,437 కోట్లు
జనవరి నాటికి రాష్ట్ర రాబడుల కింద మొత్తం రూ.1,83,437 కోట్లు సమకూరాయి. అంచనా వేసిన రాబడులు రూ.2,74,057 కోట్లలో ఇది 66.57 శాతమే. ఈసారి అంచనా వేసిన వ్యయం రూ.2,54,431 కోట్లలో సంక్షేమ పథకాలు, జీత భత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీల కోసం జనవరి నాటికి రూ.1,78,947 కోట్ల(70.33ు)ను వ్యయం చేసినట్లు వెల్లడించింది.