Uttam: రేపటితో సహాయ చర్యలు పూర్తి
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:23 AM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో సహాయ కార్యక్రమాలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని, ఇందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

దేశంలోని టన్నెల్ నిష్ణాతులందర్నీ రప్పించి చర్యలు చేపట్టాం
అత్యున్నత టెక్నాలజీ వినియోగం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
మహబూబ్‌నగర్/అచ్చంపేట/దోమలపెంట/హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో సహాయ కార్యక్రమాలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని, ఇందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొరంగ మార్గంలో జరిగే ప్రమాదాలను ఎదుర్కొనడంలో అత్యంత ప్రతిభావంతమైన దేశ సరిహద్దు రహదారుల సంస్థ నిపుణులు సహా దేశంలోని టన్నెల్ నిష్ణాతులందరినీ రప్పించామని చెప్పారు. దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సహాయ చర్యల్లో పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు. గడిచిన ఐదు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోందన్నారు. బుధవారం దోమలపెంటలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జిల్లా కలెక్టర్ సంతోష్, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఏజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ టన్నెల్‌లోని నీటిని భారీ పంపులతో బయటికి పంపడం, బురదను తొలగించి టీబీఎం ముందుభాగాన్ని చేరుకోనున్నట్లు తెలిపారు. టీబీఎం చివరి భాగాలను గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో తొలగించనున్నట్లు వివరించారు. అనంతరం ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్ సహాయంతో టన్నెల్‌లో చిక్కుకున్నవారిని వెలికితీస్తామని చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. టన్నెల్‌లో దాదాపు 200 మీటర్ల మేర బురద, నీరు పేరుకుపోయిందని, దాంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి అని, సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారన్నారు. ప్రమాద ప్రాంతం భౌగోళికంగా క్లిష్టమైన ప్రదేశం కావడంతో భారీ యంత్రాలను అక్కడికి చేర్చడం కష్టంగా మారిందన్నారు. బుధవారం వచ్చిన ఆర్మీ నిపుణులు కూడా టన్నెల్‌లోకి వెళ్లి పరిస్థితులను అంచనా వేశారని తెలిపారు. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగాయన్నారు. సమీక్షా సమావేశంలో దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, ప్రత్యేక అధికారి శ్రీధర్, టన్నెల్ రంగ నిపుణులు పాల్గొన్నారు.