chandrababu kuppam tour: పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు
ABN , First Publish Date - 2023-01-04T18:18:12+05:30 IST
రోడ్‌షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్దూరు నుంచి పాదయాత్రగా తన పర్యటనను కొనసాగిస్తున్నట్లు టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) ప్రకటించారు.
కుప్పం,(చిత్తూరు): రోడ్‌షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్దూరు నుంచి పాదయాత్రగా తన పర్యటనను కొనసాగిస్తున్నట్లు టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) ప్రకటించారు. రోడ్‌షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పాదయాత్రగా గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచాలని, ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ నియంతృత్వ ధోరణిని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. జగన్ (JAGAN) మళ్లీ గెలవడని.. ఎన్నికల తరువాత ఇంటికి పోతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. సాక్షి టీవీ, పత్రిక అమానుషమని, ఇప్పటికే చట్టం ఉండగా ప్రభుత్వం ఎందుకు చీకటి జీవో తెచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ చట్టం ప్రకారం జీవో 1 తెచ్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 2న జీవో తెచ్చారని.. 3 నుంచే డీజీపీ అమలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల గొంతు నొక్కడమే అని, దీనిని సాగనివ్వబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ చట్టం కింద తన రోడ్డు షోలపై పోలీసులు అభ్యంతరం తెలుపుతున్నారని, ఇంటింటికి వెళ్లి ప్రజలను కలవాలని పోలీసులు అంటున్నారని తెలిపారు.
ఒక ప్రతిపక్ష నేత 5 కోట్ల మందిని ఎలా కలవగలరని, డీఎస్పీ కూడా ఇంటింటికి వెళ్లగలరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రెడ్డి సైకోలా మారాలనుకుంటున్నారా?, పోలీసులకు దమ్ముంటే సీఎం బాబాయ్‌ను ఎవరు చంపారో తేల్చండి అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను గూండా, సైకో రాజకీయం చేయనని, ప్రతిపక్షాలను గ్రామాలకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను, ఎన్జీవోలను, ఉద్యోగులను, ప్రజలను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎంతబాధపెట్టినా, ఇబ్బందులు పెట్టినా పారిపోయేవాడిని కాదని, తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరో పోలీసులు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తనను అప్రతిష్ఠపాలు చేయాలనుకుంటున్నారా?, పోలీసులు ఏం చేస్తారు.. అరెస్ట్ చేస్తారా?, వైసీపీకి ఒక రూల్.. తమకో రూలా అని చంద్రబాబు ప్రశ్నించారు. తన పోరాటం పోలీసులపై కాదని.. సైకో సీఎంపై అని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల్లోనూ మంచివారు ఉన్నారని, పోలీసులు మనసు చంపుకుని పని చేస్తున్నారని, లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బ్రిటిష్, నియంతల పాలన కంటే జగన్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని, 40 ఏళ్లలో తన వాహనాన్ని, మైక్‌ను ఎవరూ డిస్టర్బ్ చేయలేదని, ఈ సైకో సీఎం జగన్‌రెడ్డి డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.