TDP: విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం
ABN , First Publish Date - 2023-01-03T12:41:47+05:30 IST
విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
అమరావతి: విజయవాడ పశ్చిమ టీడీపీ (Vijayawada West TDP)లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న (Former MLC Budda Venkanna) ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కేశినేని చిన్ని (Kesineni Chinni) ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి కానుకుల పంపిణీ కార్యక్రమంలో బుద్దా వెంకన్న ఈ మేరకు ప్రకటన చేశారు. టార్గెట్ కేశినేని నానిగా.. విజయవాడ పశ్చిమలో టీడీపీ నేతలు పలు వ్యాఖ్యలు చేశారు.
బుద్దా వెంకన్న మాట్లాడుతూ... 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తెలిపారు. అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చుని ఆయన్ని అవమానించిన వారి అంతు చూస్తామన్నారు. తాను, నాగుల్ మీరా ఇద్దరం ఈసారి చట్ట సభల్లో అడుగుపెడతామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోలు పట్టించుకోమన్నారు. పార్టీలో ఏ పదవి లేకుండానే కేశినేని చిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. చిన్నీకి పదవి ఉంటే పేదలకు మరింత లాభమన్నారు. వైసీపీ నేతలే మనుషుల్ని పంపి తెలుగుదేశం సభల్లో తొక్కిసలాట సృష్టించారని బుద్దా వెంకన్న ఆరోపించారు.
నాగుల్ మీరా మాట్లాడుతూ... విజయవాడ పశ్చిమలో ఈ సారి పోటీచేసి గెలిచేది తెలుగుదేశమే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాను, బుద్దా వెంకన్న ఇద్దరమే పశ్చిమ నియోజకవర్గoలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామన్నారు.
కేశినేని చిన్ని మాట్లాడుతూ... కార్యకర్తల త్యాగాల ముందు తాను చేసే సేవా కార్యక్రమాలు చాలా చిన్నవన్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోట అని చెప్పారు. పలుమార్లు టీడీపీ పశ్చిమలో పోటీ చేయకపోయినా బుద్దా, మీరా నాయకత్వంలో పార్టీ బలంగా ఉందని తెలిపారు.