NIA court: కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు కోర్టు ఆదేశాలు
ABN , First Publish Date - 2023-03-14T18:15:20+05:30 IST
కోడికత్తి కేసులో విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy) ఎన్‌ఐఏ కోర్టు (NIA court) ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ: కోడికత్తి కేసులో విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy) ఎన్‌ఐఏ కోర్టు (NIA court) ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు సీఎం జగన్ హాజరుకావాలని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు స్పష్టం చేసింది. సీఎంతో పాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమాండర్ దినేష్‌ను ఎన్ఐఏ విచారించింది. కేసుకు సంబంధించి కోడికత్తి, మరో చిన్నకత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
గతవారంలో ఇదే కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport)లో నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy)పై కోతికత్తి (Kodi Kathi)తో జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ ఎన్‌ఐఏ కోర్టులో జరిగింది. విచారణలో భాగంగా సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్‌ను సాక్షిగా విచారించారు. ఘటన జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయనే కావడంతో విచారించారు. దినేష్ కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న్యాయమూర్తి విచారించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడి నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోడికత్తితోపాటు పర్సు, బెల్టు వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని దినేష్‌కుమార్ వివరించారు. వాటిని చూపించమని న్యాయమూర్తి అడిగినప్పుడు తీసుకురాలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరం జరిగిన తర్వాత సీజ్ చేసిన వస్తువులను కోర్టు అడిగినప్పుడు చూపించాలి కదా అని అడిగారు. సాక్షులను విచారిస్తున్నప్పుడు వాటిని తీసుకురావల్సిన బాధ్యత ఐవోపై లేదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో సీజ్ చేసిన వస్తువులను కోర్టుకు చూపించాలని ఆదేశించారు.