YCP MP MVV Satyanarayana: విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కథ ఇలా సుఖాంతం అయింది!
ABN , First Publish Date - 2023-06-15T16:12:11+05:30 IST
గ్రేటర్ విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ సభ్యుల కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. సినీ ఫక్కీలో చేజ్ చేసి కిడ్నాపర్లను
విశాఖ: గ్రేటర్ విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (YCP MP MVV Satyanarayana) ఫ్యామిలీ సభ్యుల కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. సినీ ఫక్కీలో చేజ్ చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మీడియా కంట పడకుండా బాధితులను పోలీసులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. నలుగురు దుండగులను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు కలిసి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్‍గా పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే కిడ్నాపర్లు.. 48 గంటల పాటు ఎంపీ ఇంట్లోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. ఎంపీ సత్యనారాయణ మాత్రం రెండ్రోజుల నుంచీ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆడిటర్ జీవీకి కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఎంపీకి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు, ఆడిటర్ ఏదో ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించారు. వెంటనే కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల చెర నుంచీ బాధితులను రక్షించారు. కిడ్నాపైన కొన్ని గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. మరోవైపు కిడ్నాపర్ హేమంత్ తప్పించుకునేందుకు ప్రయత్నం చేయడంతో చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. రౌడీషీటర్ హేమంత్‌పై రెండు కిడ్నాప్, ఓ మర్డర్ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హేమంత్ ఈ కిడ్నాప్ ద్వారా రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హేమంత్ తరచూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గొడవలు పడుతూ ఉంటాడని పోలీసులు వెల్లడించారు. ఈ సంవత్సరం కూడా అతనిపై ఇలాంటి కేసులు ఉన్నాయన్నారు. కిడ్నాప్ ఘటన జరగగానే ఇందులో హేమంత్ పాత్ర ఉండొచ్చనే అనుమానాలు కలిగినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఈ కేసును త్వరగా ఛేదించారని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉండడం.. కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కిడ్నాప్ వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు మీడియాకు తెలియజేయనున్నారు.