YV SubbaReddy: విశాఖ ఆటో ప్రమాదంపై వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్
ABN , First Publish Date - 2023-11-22T13:15:44+05:30 IST
Andhrapradesh: నగరంలోని సంఘం శరత్ థియేటర్ సమీపంలో స్కూల్ ఆటోను లారీ ఢీకొన్న ఘటనపై వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
విశాఖపట్నం: నగరంలోని సంఘం శరత్ థియేటర్ సమీపంలో స్కూల్ ఆటోను లారీ ఢీకొన్న ఘటనపై వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి (YCP Uttarandhra in-charge YV Subbareddy) స్పందించారు. బేతని స్కూల్‌కు చెందిన 8 మంది విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని అన్నారు. వైద్యం కోసం ఐదుగురిని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారని తెలిపారు. ఇందులో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారని, అందులో ఒక విద్యార్థి సురక్షితంగా బయటపడగా మరో విద్యార్థి తలపై తీవ్రమైన గాయం అయ్యిందని, ఆపరేషన్ చేస్తున్నారని పేర్కొన్నారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆటో డ్రైవర్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే రైల్వే ఆసుపత్రిలో మరో విద్యార్థి చికిత్స పొందుతున్నారని, స్కూల్ యాజమాన్యం, ట్రాన్స్ పోర్ట్ వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ చూస్తే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కనపడిందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల అయ్యే వైద్యం ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.