Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతిపై కాంగ్రెస్ రహస్య సమావేశం
ABN , First Publish Date - 2023-07-15T13:54:18+05:30 IST
ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC) అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ తన్ఖా, కేటీఎస్ తులసి, మనీశ్ తివారీ, ఎల్ హనుమంతయ్య, అభిషేక్ మను సింఘ్వి పాల్గొన్నారు.
న్యూఢిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC) అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ తన్ఖా, కేటీఎస్ తులసి, మనీశ్ తివారీ, ఎల్ హనుమంతయ్య, అభిషేక్ మను సింఘ్వి పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) వర్గాలు శనివారం ఈ వివరాలను తెలిపాయి.
ముసాయిదా యూసీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం బయటపెట్టే వరకు తన వైఖరిని వెల్లడించేది లేదని కాంగ్రెస్ తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా యూసీసీని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 44 చెప్తోంది. యూసీసీ అమల్లోకి వస్తే, పెళ్లి, వారసత్వం, దత్తత స్వీకారం వంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించిన నిబంధనలు దేశంలోని ప్రజలందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భోపాల్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, యూసీసీ అమలు గురించి ప్రస్తావించారు. ఒకే కుటుంబంలో వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు చట్టాలు అమలవడం మంచిదేనా? అని ప్రశ్నించారు.
22వ శాసన పరిశీలన సంఘం (Law Commission) యూసీసీపై వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది. అభిప్రాయాలను సమర్పించేందుకు ఇచ్చిన గడువు జూలై 14తో ముగిసింది. అయితే ఈ సంఘం యూసీసీపై ప్రభుత్వానికి కేవలం ఓ నివేదికను మాత్రమే సమర్పించగలదు. దీనికి కట్టుబడి ఉండవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. యూసీసీని అమలు చేయడానికి ఇదే సరైన సమయమని ప్రభుత్వం భావిస్తే, వెంటనే పార్లమెంటు అనుమతిని కోరవచ్చు.
ఇదిలావుండగా, ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)ని శిరోమణి అకాలీ దళ్ (SAD) వ్యతిరేకించింది. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని చెప్పింది. ఈ మేరకు లా కమిషన్కు ఓ లేఖ రాసింది.
ఇవి కూడా చదవండి :
Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ
Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు