Share News

Michaung Cyclone: మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్.. చెన్నైలో ఇద్దరు మృతి.. రైళ్లు, విమానాలు రద్దు

ABN , First Publish Date - 2023-12-04T11:04:46+05:30 IST

మిచాంగ్(Michaung Cyclone) తుపాన్ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుపాన్ ధాటికి రాజధాని చెన్నై(Chennai)లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

Michaung Cyclone: మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్.. చెన్నైలో ఇద్దరు మృతి.. రైళ్లు, విమానాలు రద్దు

చెన్నై: మిచాంగ్(Michaung Cyclone) తుపాన్ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుపాన్ ధాటికి రాజధాని చెన్నై(Chennai)లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా చెన్నైలోని కనత్తూర్ లో కొత్తగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఎఫెక్ట్ రైల్వే స్టేషన్ల, ఎయిర్ పోర్ట్‌లపై పడింది. రైలుపట్టాలు మునిగిపోవడంతో సబ్ వేలు మూతపడ్డాయి. సబర్బన్ రైళ్లను నిలిపివేశారు. పలు విమనాలు రద్దు కాగా, మరొకొన్నింటిని దారి మళ్లించారు.


మిచాంగ్ తుపాన్ తమిళనాడు, ఏపీ తీరానికి తాకడంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. చెన్నై - మైసూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు కోవై ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కేఎస్‌ఆర్ బెంగళూరు ఎసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, కేఎస్‌ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు అయ్యాయి.

రానున్న 24 గంటల్లో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు చెన్నైలో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదకర స్థాయికి మించి నీరు ప్రవహిస్తున్న దృష్ట్యా బేసిన్ బ్రిడ్జి, వ్యాసర్పాడి మధ్య బ్రిడ్జి పై రాకపోకలు తాత్కాలికంగా నిలిపేశారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడగా, పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వలసరవక్కం (154.2 మి.మీ), నుంగంబాక్కం (101.7 మి.మీ), షోలింగనల్లూరు (125.7 మి.మీ), కోడంబాక్కం (123.3 మి.మీ), మీనంబాక్కం (108 మి.మీ) చొప్పున వర్షపాతం నమోదైంది. పొరుగున ఉన్న కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.

Updated Date - 2023-12-04T11:04:48+05:30 IST