Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..

ABN , First Publish Date - 2023-06-06T10:27:18+05:30 IST

మూడు దశాబ్దాల్లో అతి పెద్ద రైలు ప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మంది క్షతగాత్రులయ్యారు.

Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..
Dulal Mazumdar

బాలాసోర్ : మూడు దశాబ్దాల్లో అతి పెద్ద రైలు ప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మంది క్షతగాత్రులయ్యారు. అలాంటి సమయంలో విధి చేసిన అద్భుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అస్సాంకు చెందిన దులాల్ మజుందార్ (Dulal Mazumdar) 48 గంటలపాటు ఓ తుప్ప క్రింద చిక్కుకుని, సహాయం కోసం ఎవరినైనా పిలవడానికి సైతం సత్తువ లేని స్థితిలో కనిపించారు. ఆ వైపు వెళ్లిన సోరో పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయన మూలుగును లీలగా విన్నారు. హుటాహుటిన ప్రాథమిక చికిత్స చేయించి, జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.

దులాల్ మజుందార్‌ (35)ను గుర్తించిన సోరో పోలీస్ స్టేషన్ సిబ్బందిలో ఒకరు మీడియాతో మాట్లాడుతూ, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ తలక్రిందులైందని, దాని పక్కనే దట్టంగా పెద్ద తుప్ప ఉందని, ఆ తుప్ప క్రింద ఓ వ్యక్తి సన్నగా, నీరసంగా మూలుగుతున్నట్లు వినిపించిందని చెప్పారు. ఆయన తీవ్రంగా గాయపడి ఉన్నట్లు గుర్తించామన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది ఈ తుప్ప బయట వైపు పరిశీలించారని, కానీ పూర్తిగా లోపలివైపున ఆయన పడిపోయి ఉన్నారని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున రైలు ప్రమాదం జరిగిన తర్వాత 48 గంటలపాటు ఆయన ఎలా సజీవంగా ఉన్నారో అని తమకు చాలా ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. వెంటనే తాము సహాయం కోసం పిలుపునిచ్చామని, కొందరు సామాజిక కార్యకర్తలు తమకు సహాయపడ్డారని చెప్పారు. దులాల్‌ను సమీపంలో ఉన్న కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకెళ్లి, ప్రాథమిక చికిత్స చేయించామని, ఆ తర్వాత బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో దులాల్ (35) ఆదివారం మాట్లాడుతూ, తాను అస్సాంకు చెందినవాడినని చెప్పారు. తాను మరో ఐదుగురితో కలిసి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించినట్లు తెలిపారు. ఆయనతోపాటు ప్రయాణించినవారు ప్రాణాలు కోల్పోయారా? గాయపడినవారిలో ఉన్నారా? అనే విషయం తెలియలేదు.

రైలు ప్రమాదం జరిగినపుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో జనరల్ కంపార్ట్‌మెంట్లో వీరంతా ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలోని డాక్టర్ సుభజిత్ గిరి చెప్పారు. దులాల్ రైలు నుంచి వేగంగా విసిరికొట్టినట్లుగా, తుప్పలో పడిపోయి ఉండవచ్చునని చెప్పారు. రెండు రోజులపాటు ఆయన సజీవంగా ఉండటం అద్భుతమని తెలిపారు.

దులాల్ మజుందార్‌ను సోమవారం ఉదయం భువనేశ్వర్‌లోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS)కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆయన తలకు గాయమవడంతో ఇప్పటికీ ప్రమాదకర స్థితిలోనే ఉన్నారు. ఎయిమ్స్ పీఆర్ఓ రాజ్ కిశోర్ దాస్ మాట్లాడుతూ, దులాల్‌ తలకు గాయమైందని, ఆయన పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, చికిత్స చేస్తున్నామని చెప్పారు. ఆయనను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు, రైల్వే బృందాలు మరోసారి అన్వేషణ జరిపాయి. గత మూడు రోజుల్లో సహాయక బృందాలకు కనిపించకుండా ఎవరైనా సజీవంగా ఉన్నారా? లేదా మృతదేహాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

ఇవి కూడా చదవండి :

Governor: గవర్నర్‌ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

America : భారత్ శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశం : అమెరికా

Updated Date - 2023-06-06T10:27:18+05:30 IST