Tripura Assembly polls: సీఎం సహా 48 మంది అభ్యర్థులతో బీజేపీ, 17 మందితో కాంగ్రెస్ జాబితా
ABN , First Publish Date - 2023-01-28T15:24:40+05:30 IST
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ శనివారంనాడు..
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో (Tripura Assembly Elections) పోటీ చేసే 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ (Bjp) శనివారంనాడు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా (Manik saha) తన సొంత నియోజకవర్గమైన టౌన్ బోర్డోవాలి (Town Bordowali) నుంచి బీజేపీ అభ్యర్థిగా తిరిగి బరిలోకి దిగుతున్నారు. ధన్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ చేయనుండగా, శుక్రవారంనాడు పార్టీలో చేరిన మహమ్మద్ మోబోషర్ అలీ కైలాషహర్ నుంచి పోటీ చేస్తారు. బనమలిపూర్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రజిబ్ భట్టాచార్జి పోటీ చేయనున్నారు.
17 మందితో కాంగ్రెస్ జాబితా
కాగా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. అగర్తాలా నుంచి సుదీప్ రాయ్ బర్మన్ పోటీ చేయనున్నారు. 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న పోలింగ్ జరుగనుండగా, మార్చి 2న ఫలితాలు ప్రకటిస్తారు. ఈనెల 30వ తేదీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ మరుసటి రోజే నామినేషన్ పత్రాల స్క్రూటినీ ఉంటుంది. ఫిబ్రవరి 2వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే బీజేపీ బరిలోకి దిగుతూ మరోసారి సత్తా చాటుకోవాలని అనుకుంటోంది. ఇందుకు అనుగుణంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ కమిటీ సమావేశంపై అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలతో సహా వివిధ వర్గాలకు పెద్ద పీట వేస్తున్నట్టు బీజేపీ చెబుతోంది. సీపీఎం ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తోంది.