Entry Permit: దుబాయి వెళ్తున్నారా? అయితే ఈ కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ గురించి తెలుసుకోండి..!
ABN , First Publish Date - 2023-08-20T07:43:21+05:30 IST
కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ (New Entry Permit System) ను దుబాయి ప్రకటించింది. జీసీసీ నివాసితుల కోసం దుబాయి ఆన్‌లైన్ ఎంట్రీ పర్మిట్ సిస్టమ్‌ను ప్రారంభించింది.
దుబాయి: కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ (New Entry Permit System) ను దుబాయి ప్రకటించింది. జీసీసీ నివాసితుల కోసం దుబాయి ఆన్‌లైన్ ఎంట్రీ పర్మిట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. జీసీసీ (Gulf Cooperation Council) నివాసితులు ఇప్పుడు యూఏఈ ప్రవేశ అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని దుబాయి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (General Directorate of Residency and Foreigners Affairs) వెల్లడించింది. దీనిలో భాగంగా జీడీఆర్ఎఫ్ఏ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొత్త ప్రవేశ అనుమతి కోసం కావాల్సిన ధృవ పత్రాల వివరాలను వెల్లడించింది. ఒరిజినల్ పాస్‌పోర్టు, జీసీసీ దేశం జారీ చేసిన ఒరిజినల్ రెసిడెన్సీ అనుమతి పత్రం, పౌర లేదా లేబర్ కార్డు కావాల్సి ఉంటుంది. జీడీఆర్ఎఫ్ఏ (GDRFA) అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తును పూర్తి చేసి, రుసుము చెల్లించాలి. దీనికి వ్యాట్ (VAT) రూపంలో 5శాతంతో కలిపి మొత్తంగా 250 దిర్హమ్స్ (రూ.5,660) ఖర్చవుతుంది.
అయితే, జీసీసీ నివాసి (GCC Resident) తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. విదేశీయుడు కనీసం ఒక ఏడాది పాటు చెల్లుబాటయ్యే రెసిడెన్సీ అనుమతిని కలిగి ఉండడం తప్పనిసరి. ప్రయాణికుడిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఆంక్షలు ఉండకూడదు. వర్క్ లేదా రెసిడెన్సీ కార్డులో వృత్తి చేర్చి ఉండాలి. ఇక ఈ ఆన్‌లైన్ సర్వీసులు 24/7 అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. కనీసం 48 గంటల ప్రాసెసింగ్ సమయం పడుతుందని జీడీఆర్ఎఫ్ఏ తన పోస్ట్‌లో తెలిపింది.