TANA: పదవికే విరామం .. సేవ నిర్విరామం: అంజయ్య చౌదరి లావు
ABN , First Publish Date - 2023-07-26T08:15:32+05:30 IST
2021-23 రెండేళ్ల పాటు తానా అధ్యక్షుడిగా పని చేసిన అంజయ్య చౌదరి లావు తాజాగా పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా తన రెండేళ్ల పదవి కాలానికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
TANA: 2021-23 రెండేళ్ల పాటు తానా అధ్యక్షుడిగా పని చేసిన అంజయ్య చౌదరి లావు తాజాగా పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా తన రెండేళ్ల పదవి కాలానికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రెస్ నోట్‌లో.."రెండేళ్ళ క్రితం తానా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎన్నో సవాళ్ళు నా ఎదుట ఉన్నాయి. అది కోవిడ్ మహమ్మారి గుప్పెటి నుండి మెల్లగా ప్రపంచం కోలుకుంటున్న వేళ. ఆ సవాళ్ళని ఒక్కొక్కటిగా అధిగమించి, అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతూ తానా చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా సేవ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చేయగలగడం మా కార్యవర్గ బృందం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అభివృద్ధి పథానికి రూపకల్పన, కార్యచరణ, నిర్వహణ కోసం మా బృందం చేసిన నిస్వార్థమైన కృషి, వారు వెచ్చించిన వ్యక్తిగత సమయం ఈ ఘనతకి మూల కారణం. అలాగే ఈ కార్యక్రమాలన్నింటికి ఆర్థికంగా వెన్నంటి నిలిచిన దాతలు అందరికీ పేరు పేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సేవ వల్ల వచ్చిన పుణ్యం అంతా వీరందరికే చెందుతుంది. కేవలం స్వప్రయోజనాలు చూసుకునే మనుషులు ఎక్కువ అవుతున్న నేటి సమాజంలో ఇంతమంది హితులను, స్నేహితులని సంపాదించడం నా పూర్వ జన్మ సుకృతం."
'తానా' అనేది నా కుటుంబంలో ఒక భాగమే కాదు తానానే నా కుటుంబం అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటాను. తానాలో ఎటువంటి కార్యక్రమం చేసినా మా బృందం అంతా ఎంతో ఇష్టపూర్వకంగా ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతి గొప్ప పనికి ఒక ముగింపు ఉన్నట్లే, మా ఈ రెండేళ్ళ పదవీ కాలం 23వ తానా మహసభల చివరి రోజున ముగిసింది. కొత్త కార్యవర్గం తానా ఖ్యాతిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని మా బృందం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2021-23 కార్యవర్గం తన పని తీరుతో అన్ని విభాగాల్లోనూ తానా చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో అటు రాసి పరంగానూ ఇటు వాసి పరంగానూ కొనియాడదగ్గ స్థాయిలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గత రెండేళ్ళుగా తానా తరఫున మా వ్యవస్థాపక బృందం, దాతలు మరియు తానా సభ్యుల సహకారంతో చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాలను మరొక్క సారి మననం చేసుకుంటున్నాను:
1) 46వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తానాలో గత 44 సంవత్సరాలుగా 36 వేల మంది సభ్యులు చేరగా, కేవలం గత రెండేళ్ళ కాలంలో (2021-23) మరో 36 వేల మంది జీవితకాల సభ్యులు అదనంగా చేరి తానా బలాన్ని రెట్టింపు చేసి మొత్తం 72 వేల జీవితకాల సభ్యులతో అంతర్జాతీయంగా అతి పెద్ద NRI తెలుగు సంస్థగా ఆవిర్భవించడం ఒక గర్వకారణం. పది వేల డాలర్లు తానా ఫౌండేషన్ కార్యక్రమాలకు డొనేషన్ ఇవ్వడం ద్వారా ఫౌండేషన్ డోనార్లు గా శాశ్వత సభ్యత్వం పొందిన వారి సంఖ్య గత 44 ఏళ్ళుగా 62 మంది ఉండగా అది గత రెండేళ్ళలో మరొక 132 మంది అదనంగా చేరడం తానా పై తెలుగు వారికి పెరిగిన నమ్మకానికి, ప్రేమకు నిదర్శనం. మొత్తంగా జీవితకాల సభ్యులు మరియు శాశ్వత ఫౌండేషన్ డోనార్ల ద్వారా 4 మిలియన్ డాలర్ల ఆదాయం తానా కార్యక్రమాలకు సమకూరడం తానా చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.
2) "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్న నిజాన్ని గుర్తించి తానా ఎంతో కాలంగా EYE కాంపులను నిర్వహిస్తూ శంకర నేత్రాలయ, రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో లక్షల మందికి కంటి పరీక్షలు చేయించి వేల మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేయించడం, కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. దీనిని మరో స్థాయికి తీసుకెళ్తూ 50 క్యాంపులు చేయాలన్న లక్ష్యాన్ని దాటి ఈ రెండేళ్ల క్యాలంలో 80కి పైగా కాంపులు నిర్వహించామంటే మా బృందం యొక్క పని తీరుని ఎంత కొనియాడినా తక్కువే.
3) కాన్సర్ మహమ్మారిని రూపుమాపే ప్రయత్నంలో భాగంగా గ్రేస్ ఫౌండేషన్ మరియు బసవతారకం ఇండో-అమెరికన్ కాన్సర్ ఆసుపత్రి ద్వారా కాన్సర్ కాంపులు సమర్థవంతంగా నిర్వహించి 100 కాన్సర్ కాంపులు నిర్వహించాలన్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే కాన్సర్ చికిత్సకు అవగాహన కల్పించే క్రమంలో భాగంగా తానా తరఫున బసవతారకం ఇండో-అమెరికన్ కాన్సర్ ఆసుపత్రికి కోటి రూపాయల విరాళం సమకూర్చడం జరిగింది.
4) ఎంతో కష్టపడి చదువుతూ పేదరికం వల్ల పై చదువులు చదువుకోలేని విద్యార్థులు దాదాపు 1800 మందికి తానా "చేయూత" కార్యక్రమం ద్వారా భారత దేశంలోను, అమెరికాలోను స్కాలర్‌షిప్స్ మంజూరు చేయడం జరిగింది.
5) తానా "ఆదరణ" మరియు "తోడ్పాటు" కార్యక్రమాల ద్వారా దివ్యాంగులకు సైకిళ్ళు, మూడు చక్రాల బళ్ళు, బాలికలకు సైకిళ్ళు, లాప్‌టాప్‌లు ఇవ్వగా, తానా "అన్నపూర్ణ" ద్వారా విజయవాడ, గుంటూరు, తెనాలి గవర్నమెంటు హాస్పిటళ్ళ దగ్గర రోగులకు ప్రతి రోజూ 600 మందికి పైగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే తానా "ఆరుణ్య" ద్వారా బధిర, మూగ ఇబ్బందులున్న 5 ఏళ్ళ లోపు చిన్నారులకు ప్రభుత్వ సంస్థల సహాకారంతో ఆపరేషన్లు చేయించడం జరిగింది.
6) తానా ఫౌండేషన్ కార్యకలాపాల్లో భాగంగా మిలియన్ డాలర్లతో తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాల్లో శాశ్వత గ్రంథాలయాలు, కమ్యూనిటీ సెంటర్‌లు, డిజిటల్ క్లాస్ రూములు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
7) తానా "చైతన్య స్రవంతి"లో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక కళోత్సవాలు, మరుగున పడిన కళలను ప్రోత్సహిస్తూ, కళాకారులను గౌరవిస్తూ 40 రోజుల పాటు నిరంతరాయంగా 110 కార్యక్రమాలు నిర్వహించడం ఒక గొప్ప భాగ్యం. తొలిసారిగా 5 దక్షిణ భారత రాష్ట్రాల నుండి విచ్చేసిన దివ్యాంగులకు "వీల్ చైర్స్" టోర్నమెంటును వైజాగ్ గీతం యూనివర్సిటీలో నిర్వహించడం ఇంతకు ముందెన్నడూ చూడని అరుదైన విషయం. తానా "కళారాధన" పేరిట తెలుగు సినీపరిశ్రమకు చెందిన ముఖ్య కళాకారులను సన్మానించుకోవడం జరిగింది. రైతుల కోసం పవర్ స్ప్రేయర్‌లు, రక్షణ పరికరాలు, "రైతుకోసం" కార్యక్రమాలు కృష్ణా జిల్లా పాల సంఘం సహకారంతో నిర్వహించడం జరిగింది. తానా చరిత్రలోనే నభూతో అన్న రీతిలో 3 మిలియన్ డాలర్లతో ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ఈసారి "చైతన్య స్రవంతి" నిర్వహించడం జరిగింది అని చెప్పడానికి మిక్కిలి సంతోషిస్తున్నాను.
8) తానా అత్యవసర విపత్కర విభాగ సంస్థ (TANA TEAM SQUARE) అమెరికాలో నిర్వహించే కార్యక్రమలు అన్నింటిలోకీ చాలా కీలకమైనది. ఎన్నో ఆశలతో అమెరికా వచ్చే యువతీ యువకులు, వారిని చూడటానికి వచ్చే పెద్ద వయసు తల్లిదండ్రులు అనుకోని కారణాల వల్ల చనిపోవడం జరిగితే వారికి తానా అన్ని విధాలా చేయూతనిస్తూ చనిపోయిన వారి పార్థివ దేహాన్ని సముచిత రీతిలో భారత దేశం చేర వేసే విషయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇటువంటి సమయాల్లో తెలుగు వారే కాక వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులెందరో ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో అమెరికాలో పోలీసులకంటే ముందు TANA TEAM SQUARE కి ఫోన్ చేయడం తానా సంస్థపై వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.
9) సరైన లైసెన్సులు లేని యూనివర్సిటీలకు పై చదువుల కోసం అమెరికా వచ్చి ఇబ్బందుల్లో చిక్కుకునే తెలుగు విద్యార్థులకు, వీసా సమస్యలతో ఇబ్బంది ఎదుర్కునే వారికి, అనుకోని పరిస్థితుల్లో వీసా అయిపొయ్యాక అమెరికాలో ఉండాల్సి వచ్చి సరైన మందులు లేని తల్లిదండ్రులకు అమెరికాలో తానా ఎంతో సహాయకారిగా ఉంటుంది. కోవిడ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తానా చేసిన నిస్వార్థమైన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బంగారు పతకం బహూకరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు తానా చేసిన సేవకు విశేష ప్రశంసలు అందించింది.
10) TANA Cares కార్యక్రమాల్లో భాగంగా కొత్త తరం యువతీ యువకుల కోసం SAT/ACT ట్రైనింగ్ క్యాంపులు, స్కూలు విద్యార్థుల కోసం దాదాపు 35 సమ్మర్ క్యాంపులు ఇమ్మిగ్రేషన్ కి సంబంధించిన సెమినార్లు, వీలునామాకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, మహిళల ఆరోగ్యం కోసం, ఆర్థిక నైపుణ్యం పెంపొందించుకోవడం కోసం ఎన్నో సెమినార్లు, వెబినార్లు నిర్వహించడం జరిగింది. బోన్ మారో డ్రైవ్‌లు, బ్లడ్ డ్రైవ్‌లు, Tax సెమినార్లు, కాలేజీలో చేరబోయే హైస్కూల్ విద్యార్తుల కోసం అవగాహన కార్యక్రమాలు, అవసరంలో ఉన్న వేలాది మంది పేద విద్యార్థులకు Toy డ్రైవ్‌లు, ఫుడ్ డ్రైవ్‌లు, Backpack ప్రోగ్రాములు నిర్వహించడం జరిగింది. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 5k వాక్‌లు, యోగా తరగతులు, అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో క్రికెట్, టెన్నిస్, త్రో బాల్, 3-ఆన్-3 బాస్కెట్ బాల్ వంటి 100 కు పైగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది.
11) తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ పెంపొందించే కార్యక్రమంలో భాగంగా భావి తరాలకు తెలుగు నేర్పడం ద్వారా వారి తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో తెలుగులో సంభాషించే వీలును కల్పిస్తూ "పాఠశాల" ను స్థాపించి అమెరికాలోని రాష్ట్రాలతో పాటు మొత్తం 5 దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో అమ్మ భాష శిక్షణకు, పరిరక్షణకు తానా తన వంతు కృషి చేస్తుంది. తానా "కళాశాల" కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా దాదాపు 500 మంది బాలికలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వ విద్యాలయం వారితో MOU ద్వారా నృత్యం మరియు సంగీతంలో శిక్షణ ద్వారా అడ్వాన్సుడ్ డిప్లమా వచ్చే అవకాశం కల్పించడం జరుగుతుంది.
12) ప్రతి నెలా చివరి ఆదివారం తానా నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" అనే వినూత్న సాహిత్య కార్యక్రమం తానా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒక కలికితురాయి. సరికొత్త ఆలోచనలతో సాహిత్యంలోని వివిధ కోణాల్ని స్పృశిస్తూ చేసే ఈ కార్యక్రమం కోసం ప్రతి నెలా సాహిత్యాభిమానులెందరో ఎదురుచూస్తూ ఉంటారు. "కేవలం మహిళా సభ్యులతో అష్టావధానం/శతావధానం", "సాహిత్యంలో మానవ వాదం", "విదేశీ కవితా ప్రక్రియలు" మొదలైనవి ఇందులో భాగంగా జరిగిన గొప్ప ప్రయోగాల్లో మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
13) ప్రముఖ కవి, సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం తరువాత వారి కుటుంబ సభ్యులు మరియు తానా సభ్యుల సహకారంతో "సిరివెన్నెల సమగ్ర సాహిత్యం" పేరిట వారి సినీ గేయమాలికలను 6 భాగాలను ముద్రించి మొదటి భాగాన్ని అప్పటి భారత దేశ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదగా, రెండవ భాగాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి శ్రీ N.V రమణ గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది.
14) ప్రతి నెల రెండవ శనివారం "తెలుగు సాంస్కృతిక సిరులు" కార్యక్రమం పేరిట కళాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది.
15) గత రెండేళ్ళుగా అమెరికాలో కిక్కిరిసి ఉండే న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఉన్న టైం స్క్వేర్‌లో బతుకమ్మ నిర్వహణ ఒక అద్భుత అంశం. తెలుగు వారి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ఈ గొప్ప వేడుక అమెరికాలోని తెలుగు వారిని ఎంతగానో అలరించింది.
16) మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా మన జీవనానికి అతి ముఖ్యమైనది ఆహారం. ఈనాడు మనం తీసుకునే ఆహారం ఎంత కలుషితమయ్యిందో, ఎన్ని రసాయనాలతో కూడుకుని ఉందో మనకు తెలియనిది కాదు. ఈ ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తానా ఫౌండేషన్ తరఫున "భూమి భారతి దేశీ విత్త కేంద్రం" గుంటూరు జిలా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా 2022 డిసెంబరు 23న సుమారు 3000 మంది చుట్టు పక్క గ్రామాల రైతుల సమక్షంలో మంగళకరంగా ప్రారంభించబడింది. ఈ కేంద్రం ద్వారా సుమారు 100 గ్రామాల రైతులకు దేశీ విత్తన భాండాగారం అందుబాటులోకి తెచ్చి హైబ్రీడ్ కానివి, జన్యు మార్పిడి కానివి అయినటువంటి స్వచ్ఛమైన విత్తనాలను అందించడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రం సౌజన్యంతో శిక్షణ ఇచ్చి ఎక్కువ మంది యువ రైతులను ప్రకృతి వ్యవసాయ విధానం వైపు అడుగులు వేయించడం, దేశీ విత్తనంలోని పోషక విలువలను శాస్త్రీయ బద్ధంగా పరిశోధన జరిపి ప్రజలకు మంచి ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయడం ఈ "భూమి భారతి దేశీ విత్త కేంద్రం" యొక్క భవిష్యత్ ప్రణాళికలు.
17) ప్రతి పురుషుని విజయం వెనుక వెన్నంటి ఉండే మహిళలకు పెద్ద పీట వేస్తూ మహిళా సాధికారత కోసం ఆర్థిక సెమినార్లు, హెల్త్ మరియు వెల్త్ సెమినార్లు, వివిధ నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వారికి ఉద్యోగావకాశాలు పెంపొందే విధంగా వర్క్‌షాప్స్ నిర్వహణ, సమాజంలో ఉన్నత స్థాయిని సాధించి అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన మహిళా పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలతో చర్చలు, మహిళలను గౌరవిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు, మాతృ దినోత్సవ వేడుకలు మొదలగు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తానాలో మహిళల పాత్ర గణనీయంగా పెరిగేలా చేసి వారికి ప్రోత్సాహం అందించడం జరిగింది.
18)తెలుగు వారి గుండె చప్పుడు, శక పురుషుడు, శ్రీ నందమూరి తారక రాముని శత జయంతి ఉత్సవం నేను అద్యక్షునిగా ఉన్న కాలంలో రావడం భగవత్ సంకల్పంగా భావిస్తున్నాను. ఆ యుగపురుషుడికి నీరాజనం అర్పిస్తూ అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోని తెలుగు వారందరితో కలిసి పండుగలా జరుపుకుని ఆ మహనీయుని స్మరించుకోవడం ఒక జీవితకాలపు అనుభూతి.
ఈ లోకంలోకి రావడం.. లోకం నుండి నిష్క్రమించడం మన చేతుల్లో లేదు. కానీ మనం ఉన్నంత కాలం ఎలా జీవించాం, మానవాళి ప్రగతికి మన వంతు ఏమి చేశాం అనేది మాత్రమే మనం ఈ పుడమిపై చేయగలిగే ఒక చెరగని సంతకం. ఆ సంతకం బలంగా ఉండాలి అంటే మన సంకల్పం దృఢంగా వుండాలి. ఇది ప్రతి ఒక్కరి నైజంగా మారితే మానవాళి వికసిస్తుంది. ఈ నేల తల్లి పులకరిస్తుంది. మన జీవితానికి ఒక సార్థకత లభిస్తుంది. చివరిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా వెంట నిలిచి నన్ను ముందుకు నడిపించిన ఎందరో సోదర సోదరీమణులకు, స్నేహితులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సమాజ సేవకు ఎప్పుడూ ప్రోత్సాహాన్ని అందించే నా కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు నాపై ఇలాగే వుండాలని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి సేవలో మరింత భాగమయ్యేలా నన్ను దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
సదా మీ సేవలో
అంజయ్య చౌదరి లావు
'తానా' అధ్యక్షులు (2021-23)