Chittoor: వివాదాస్పదంగా మారుతోన్న చిత్తూరు పోలీసుల తీరు..రకరకాల ఆంక్షలతో ప్రతిపక్షాలకు ఇబ్బందులు..!

ABN , First Publish Date - 2023-03-07T11:13:13+05:30 IST

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలీసులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా పరిణామాలు

Chittoor: వివాదాస్పదంగా మారుతోన్న చిత్తూరు పోలీసుల తీరు..రకరకాల ఆంక్షలతో ప్రతిపక్షాలకు ఇబ్బందులు..!

ఆ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు ఏం చేసినా.. అక్కడి పోలీసులకు తప్పే.. లేనిపోని ఆంక్షల పేరుతో కేసులు, అరెస్టులు తప్పవ్‌. అదే.. అధికార పార్టీ అయితే మాత్రం.. ఏం చేసినా.. ఒప్పే. వారిపైన ఈగ కూడా వాలనివ్వరు. జీవో నెంబర్ వన్ విషయంలోనూ వైసీపీకి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ.. ప్రతిపక్ష పార్టీలకు మాత్రం అన్నీ వర్తిస్తాయ్‌. అందుకే.. అక్కడ... అధికార పార్టీకి ఓ రూల్‌.. ప్రతిపక్షాలకు మరో రూలా అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ.. ఏంటా జిల్లా?... ఆ జిల్లా పోలీసులు ఎందుకలా వ్యవహరిస్తున్నారు?..మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-11545.jpg

జీవో నెంబర్ వన్ రాక ముందు నుంచే రూల్స్‌

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలీసులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా పరిణామాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. వైసీపీకి ఓ రూలు.. ఇతర పార్టీలకు మరో రూల్‌ అన్నట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు.. జీవో నెంబర్ వన్ రాక ముందు నుంచే చిత్తూరు పోలీసులు.. ఇష్టారీతి రూల్స్‌ అమలు చేయడం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు కాకుండా ఇంకెవరైనా.. కార్యక్రమాలు చేయాలనుకుంటే.. పలు రకాల ఆంక్షలు, నిబంధనలు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేసారు. దాంతో.. కడుపు మండి రోడ్లపైకి వచ్చిన టీడీపీ శ్రేణులను అక్రమ కేసులతో.. అరెస్ట్‌ చేసి జైళ్ళకు తరలించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. చంద్రబాబు.. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారి వైసీపీ శ్రేణులు ప్రవర్తించిన తీరు, పోలీసులు చూపిన అత్యుత్సాహం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదే సమయంలో.. వైసీపీ కార్యక్రమాలను మాత్రం పోలీసులే దగ్గరుండి నడిపించిన సందర్భాలను టీడీపీతోపాటు ఇతర పార్టీలూ గుర్తు చేస్తున్నాయి.

Untitled-9544.jpg

టీడీపీ శ్రేణులపై కేసుల మీద కేసులు

మొన్నటికిమొన్న.. గతంలో ఎన్నడు లేని.. జీవో నెంబర్ వన్‌ను జగన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చింది. ఆ జీవోను సాకుగా చూపి జనవరి మొదటివారంలో కుప్పంలో జరిగిన చంద్రబాబు పర్యటనలో పోలీసులు ఇష్టారీతిన అడ్డంకులు సృష్టించారు. కేసుల మీద కేసులు నమోదు చేశారు. అలాగే.. జనవరి చివరివారంలో కుప్పం నుంచి మొదలైన లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంలోనూ అడుగడుగునా లేనిపోని ఆంక్షలు పెట్టి, అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. పాదయాత్రతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయని, మైకులు వాడకూడదని, ఎక్కువ మంది జనం గుమికూడదంటూ.. రకరకాల ఆంక్షలతో పోలీసులు ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

Untitled-854.jpg

ఎన్నికల కోడ్ పేరుతో లేనిపోని నిబంధనలు

ఇదిలావుంటే.. ఇప్పుడు కొత్తగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. పోలీసులు.. వైసీపీకి ఓ రూల్‌.. ఇతర పార్టీలకు మరో రూల్‌ అమలు చేసి విమర్శల పాలయ్యారు. ఎన్నికల కోడ్ వచ్చిందంటూ ఇతర పార్టీలకు లేనిపోని నిబంధనలు అమలు చేస్తున్న పోలీసులు.. వైసీపీ విషయంలో మాత్రం వారికేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి చిత్తూరు కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఆ నామినేషన్ల విషయంలో అధికార, ప్రతిపక్షాలకు చిత్తూరు పోలీసులు వేర్వేరు రూల్స్‌ అమలు చేయడం విమర్శలకు తావిచ్చింది. నామినేషన్ల రోజున వైసీపీ ర్యాలీలోనూ భిన్నంగా వ్యవహరించారు. గంటల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయి.. నగరవాసులు, వాహనదారులకు నరకం చూపించినా ప్రేక్షక పాత్ర పోషించారు. లోకేశ్‌ యువగళం పాదయాత్ర అనుమతుల విషయంలో మాత్రం.. పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టారు. దాంతో.. లోకేశ్‌ ఆయా అంశాలను పాదయాత్రలో నిలదీస్తూ వస్తున్నారు.

Untitled-64.jpg

నగరవాసులు, వాహనదారులకు గంటకు పైగా నరకం

ఇక.. తూర్పు రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ తరఫున శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఆ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు ఆర్కే రోజా, కాకాని గోవర్థన్‌, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు బ్యాండ్ మేళాలు, బాణాసంచాతో భారీ ర్యాలీ నిర్వహించారు. దాంతో.. చిత్తూరు నలువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కలెక్టరేట్ మార్గంలో నగరవాసులు, వాహనదారులు గంటకు పైగా నరకం చూసారు. అంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు.. ర్యాలీకి ముందు రోజు దరఖాస్తు చేసుకుంటే పోలీసులు వెంటనే అనుమతించారు. ర్యాలీకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ మళ్ళించారు. కానీ.. లోకేష్ పాదయాత్రకు అనుమతి కోరితే మాత్రం.. అదే చిత్తూరు పోలీసులు సవాలక్ష ప్రశ్నలతో వేధించారని టీడీపీ నేతలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.

Untitled-1054.jpg

పోలీసులతో ప్రతిపక్షపార్టీల వాగ్వాదం

ఇక.. నామినేషన్ వేసేందుకు అభ్యర్థుల వెంట వచ్చే వారి విషయంలోనూ పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ప్రతిపక్షపార్టీలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. నామినేషన్‌కు వైసీపీ నేతలందర్నీ గేటు లోపలికి అనుమతించిన పోలీసులు.. ఇతర పార్టీల అభ్యర్థులను ఐదారుగురికి మాత్రమే పర్మిషన్‌ ఇవ్వడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఒకదశలో పోలీసులతో వాదనకు దిగారు. ఇవేం రూల్స్‌ అంటూ పోలీసులపై కమలం పార్టీ నేతలు ఏ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మొత్తంగా.. చిత్తూరు పోలీసుల తీరు.. ప్రతిసారి వివాదాస్పదంగానే మారుతోంది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా.. పోలీసు ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏదేమైనా.. చిత్తూరు జిల్లాలో ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే.. ఎన్నికల నాటికి పరిణామాలు ఇంకెలా ఉంటాయోనన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2023-03-07T11:13:13+05:30 IST