Mynampally Issue : మైనంపల్లిపై ఏక్షణమైనా సస్పెన్షన్ వేటు.. బీఆర్ఎస్ తరఫున మల్కాజిగిరి బరిలో విజయశాంతి..!?
ABN , First Publish Date - 2023-08-22T22:20:19+05:30 IST
మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మైనంపల్లి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌తో (CM KCR) పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు..
మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మైనంపల్లి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌తో (CM KCR) పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మైనంపల్లి వ్యాఖ్యలను సహించని కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు ‘పోటీ చేయాలా వద్దా అనేది.. మీ ఇష్టం’ అని క్లియర్ కట్‌గా చెప్పేశారు. పనిలో పనిగా చివరి నిమిషంలో అయినా సరే కొందరు అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పేశారు. ఈ క్రమంలో మల్కాజిగిరి బరిలో ఇద్దరు కీలక వ్యక్తులను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు..? వారి బ్యాగ్రౌండ్ ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనం.
పరిశీలనలో ఇద్దరు..?
వాస్తవానికి మల్కాజిగిరి (Malkajgiri) అభ్యర్థిగా మైనంపల్లిని ప్రకటించిన తర్వాత మంత్రి హరీష్‌కు క్షమాపణలు చెబుతారు.. వివాదం సద్దుమణుగుతుందని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది కానీ.. సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. అస్సలు ఏ మాత్రం మైనంపల్లి వెనక్కితగ్గట్లేదు. దీంతో మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని వరుసగా నేతలు ఫిర్యాదు చేస్తుండటం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుండటం.. వేటు వేయాల్సిందేనని డిమాండ్ పెరుగుతుండటంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గులాబీ బాస్ ఫిక్స్ అయ్యారు. దీంతో మొదట అభ్యర్థిని ఎంచుకున్నాక.. ఆ తర్వాత వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. మల్కాజిగిరి నుంచి ఎవర్ని బరిలోకి దింపాలనేదానిపై ప్రగతి భవన్‌లో సమాలోచనలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి పెండింగ్ స్థానాలపై.. ముఖ్యంగా మల్కాజిగిరి అభ్యర్థి మార్పుకోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి రెడ్డి, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది. కేసీఆర్ దగ్గర ఈ ఇద్దరి అభ్యర్థిత్వానికి సంబంధించి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, సీనియర్ నేత కేకే చర్చిస్తున్నారు.
ఎవరీ విజయశాంతి..?
టైటిల్ చూడగానే.. విజయశాంతి (Vijayasanthi) అనగా.. మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత అనుకునేరు.. కాదండోయ్.! ఈమె పేరు కూడా విజయశాంతి అంతే. మాజీ ఎమ్మెల్యే చింతల కనాకరెడ్డి కోడలే చింతల విజయశాంతి (Chintala Vijayashanthi). 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అల్వాల్ (Alwal) నుంచి పోటీచేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు.. ఈమే మేయర్ బరిలో కూడా నిలిచారు. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) జనరల్ మహిళకు కేటాయించడంతో విజయశాంతి కూడా ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా తలపడ్డారు. అయితే.. చివరికి తన అత్యంత ఆప్తుడు అయిన కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మికే (Gadwal Vijayalakshmi) ఓటేశారు కేసీఆర్. దీంతో విజయశాంతితో పాటు మేయర్ పీఠం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న చాలా మంది కార్పొరేటర్లు చివరికి విజయలక్ష్మికే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఎప్పుడో ఒకసారి అధిష్టానం గుర్తించకపోతుందా..? అని అల్వాల్‌లో తన పని తాను చేసుకొని పోతున్నారు. అయితే సరిగ్గా ఇప్పుడు సువర్ణావకాశం రానే వచ్చిందని.. మల్కాజిగిరి బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్‌తో పాటు హరీష్, కవితకు కూడా కార్పొరేటర్ కుటుంబ సభ్యులు చర్చించారని తెలిసింది. అయితే కేసీఆర్ కూడా విజయశాంతి వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా సమాచారం.
ఈయన సుపరిచితుడే..!
మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri rajashekar reddy ) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మల్లారెడ్డి అల్లుడే (Mallareddy Son In Law) ఈయన. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డిపై కేవలం 10,919 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. వాస్తవానికి మైనంపల్లికి మల్లారెడ్డికి (Myanampally Vs Mallareddy) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు 2014 నుంచే ఉన్నాయి. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డి పోటీచేయగా.. బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి పోటీచేశారు. 28,371 ఓట్ల తేడాతో మల్లారెడ్డే విజయం సాధించారు. ఆ తర్వాత మల్లారెడ్డి కారెక్కినప్పటికీ ఈ ఇద్దరూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువే. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మల్లారెడ్డి ఎమ్మెల్యేగా.. తన అల్లుడిని ఎంపీగా బరిలోకి దింపారు. అయితే.. అల్లుడిని కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి తీసుకెళ్లాలనేది మల్లారెడ్డి కోరికట. ఇప్పుడు మంచి అవకాశం రావడంతో ఎట్టి పరిస్థితుల్లో మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని.. కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన చేసిన మరుక్షణం నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే పలుమార్లు ప్రగతి భవన్‌కు వెళ్లి నేరుగా సీఎం కేసీఆర్‌తోనే కూర్చొని చర్చించారు. అల్లుడి అభ్యర్థిత్వంపై చూడాలని.. కచ్చితంగా గెలిపించుకొని ప్రగతి భవన్‌కు తీసుకొస్తానని కేసీఆర్‌కు మాట కూడా ఇచ్చారట.
కేసీఆర్ ఓటెవరికి.. మైనంపల్లి అడుగులు ఎటు..!
కేసీఆర్ మాత్రం మహిళకు ఇస్తే కాస్త సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని.. విజయశాంతికే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అయితే మల్లారెడ్డి మాత్రం గట్టిగా పట్టుబట్టారట. ఇప్పుడు అసెంబ్లీ బరిలోకి దింపితే మళ్లీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి మరొక కొత్త అభ్యర్థిని బీఆర్ఎస్ వెతకాలి. ఇవన్నీ ఎందుకు ఎంపీగా పోటీచేయమను.. ఈ ఒక్కసారి అసెంబ్లీ స్థానాన్ని వదిలేయమని కేసీఆర్ చెప్పారట. అయినప్పటికీ మల్లారెడ్డి అస్సలు వినే పరిస్థితిలో లేరట. మైనంపల్లిని తట్టుకోవాలంటే మల్లారెడ్డి అల్లుడే ఆర్థికంగా అన్ని విధాలా సరైన వ్యక్తని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేసీఆర్‌కు చెబుతున్నారట. దీంతో అటు కేసీఆర్ కూడా కాస్త డైలమాలో పడ్డారట. మైనంపల్లి కచ్చితంగా కాంగ్రెస్ నుంచి పోటీచేస్తారని సమాచారం. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీకి (Congress, BJP) పెద్దగా క్యాడర్ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన రామచంద్రరావుకు 40,451 ఓట్లు మాత్రమే వచ్చాయి. మైనంపల్లికి 73,698 మెజార్టీనే వచ్చింది అంటే.. రెండోస్థానంలోని వ్యక్తికి వచ్చిన ఓట్ల కంటే ఇంకా 33వేల పైచిలుకు ఎక్కువే మెజార్టీ వచ్చింది. దీంతో మైనంపల్లిని చేర్చుకోవడానికి అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయట. అయితే మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్‌కు కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. మల్కాజిగిరి తాను పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని డైరెక్టుగా ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్‌కు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి మైనంపల్లి అడుగులు ఎటు వేస్తారో.. బీఆర్ఎస్ నుంచి విజయశాంతి, మర్రి రాజశేఖర్‌రెడ్డిలో ఎవర్ని ఫైనల్ చేస్తారో.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.