TS Congress : తెలంగాణలో సీన్ రివర్స్.. ఊహకందని రీతిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రేవంత్.. ఈ రెండే టార్గెట్..!
ABN , First Publish Date - 2023-06-16T17:02:27+05:30 IST
అవును.. తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ (Operation Akarsh) చాపకింద నీరులా సాగుతోంది.. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Jodo Yatra), కన్నడనాట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో తెలంగాణలో పార్టీకి మంచిరోజులు వచ్చినట్లయ్యింది. .
అవును.. తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ (Operation Akarsh) చాపకింద నీరులా సాగుతోంది.. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Jodo Yatra), కన్నడనాట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో తెలంగాణలో పార్టీకి మంచిరోజులు వచ్చినట్లయ్యింది. కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా వ్యూహాలు పన్నిన బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) పార్టీలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గులాబీ పార్టీ నుంచి బయటికొచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) , మాజీ మంత్రి జూపల్లి కృషారావులు (Jupally Krishna Rao) కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకోగా.. వీరితో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి (Kuchukulla Damoder Reddy) కండువా కప్పుకోబోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అతి త్వరలోనే ఇంకా చాలా చేరికలు ఉన్నాయట. మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను అధిష్టానం ప్రయోగిస్తోంది.
ఇదీ అసలు కథ..
కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) ముందు వరకూ ఒక లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా కాంగ్రెస్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఒక్క కర్ణాటకలో గెలుపు.. తెలంగాణలో ఎనలేని జోష్ నింపింది. అదేవిధంగా అగ్రనేతలపై బరువు, బాధ్యతలు మరింత పెరిగాయి. ముఖ్యంగా కర్ణాటక తర్వాత కాంగ్రెస్ తదుపరి టార్గెట్ తెలంగాణనే. ఆ ఊపుతో ఎలాగైనా సరే ఇక్కడా జెండా పాతేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని సద్వినియోగం చేసుకుంటోంది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్రారంభించిన కాంగ్రెస్.. బీజేపీ, బీఆర్ఎస్‌లో (BJP, BRS) ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. టికెట్లు దక్కే అవకాశం లేదని అంచనాలో ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా కీలక నేతలు పనిచేస్తున్నారు. నేతలతో మంతనాలు మొదలుకుని కండవా కప్పేవరకూ ఎక్కడ ఎలాంటి లీకులు రాకుండా.. మూడో కంటికి అస్సలే తెలియకుండా పీసీసీ తరఫున కొందరు నేతలు పనికానిచ్చేస్తున్నారు. ఇన్నిరోజులు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్, అసంతృప్తులను బీఆర్ఎస్, బీజేపీ లాగేయగా.. ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ చేరిపోతుండగా వీరితో పాటు దామోదర్ రెడ్డి.. మరోవైపు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి (EX MLA Gurnadha Reddy) కూడా అతి త్వరలోనే కండువాలు కప్పుకోబోతున్నారు. మరోవైపు.. ఎక్కడైతే తమ పార్టీలకు చెందిన కీలక నేతలను బీఆర్ఎస్, బీజేపీ టచ్ చేశాయో ఇప్పుడదే స్థానంలో అసంతృప్త నేతలను లాగేందుకు పీసీసీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల పార్టీ పెద్దలు గ్రాండ్ సక్సెస్ అయ్యారని తెలియవచ్చింది.
ఈ రెండింటిపైనే స్పెషల్ ఫోకస్..
మునుపటితో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందన్న విషయం జగమెరిగిన సత్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు (Sunil Kanugolu) రంగంలోకి దిగి అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించడం ప్రారంభించారు. వీలైతే టికెట్ కాని పక్షంలో కచ్చితంగా అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఉండే పదవులు ఇస్తామని హామీలిచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానించారట. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) కూడా కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తనతో పాటు మరో మూడు నియోజకవర్గాల్లో చెప్పిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలని కండీషన్ పెట్టినప్పటికీ ఓకే అని చెప్పేసిందట. మరోవైపు సర్వేలు చేయించి మరీ టికెట్లు ఇస్తామన్న హామీతో కొందరు నేతలు వెనకడుగు వేస్తున్నారని తెలియ వచ్చింది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వస్తానని సిట్టింగ్‌లు చెప్పినా.. ఎవరైనా అసంతృప్తితో ఉన్నారని తెలిసినా చాలు నిమిషాల్లో కాంగ్రెస్ పెద్దలు.. ఆ నేతల ఇంటి ముందు వాలిపోతున్నారట. ఇక బీజేపీలోనూ అదే పరిస్థితట.
మొత్తానికి చూస్తే.. ఈ చేరికల వ్యవహారంలో రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) కీలక పాత్ర పోషిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్షణం తీరిక లేకుండా పార్టీలో చేరికలు, డిక్లరేషన్, మ్యానిఫెస్టోలపై పూర్తి సమయం పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా టచ్‌లోకి వచ్చినా సరే మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ పెద్దలు ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నారట. ముఖ్యంగా భేటీలు కూడా హైదరాబాద్‌లో అయితే అనుమానం వస్తుందని బెంగళూరు వేదికగా జరుపుతుండటాన్ని బట్టి చూస్తే.. కాంగ్రెస్ ఏ రేంజ్‌లో జాగ్రత్త పడుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకూ అయితే పెద్ద తలకాయలే కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.. ఇకపైనా, ఎన్నికల ముందు చేరికలో ఏ రేంజ్‌లో చేరికలు ఉంటాయో చూడాల్సిందే మరి.