Modi On AP : ప్రధాని మోదీ కామెంట్స్‌తో డైలామాలో పడిన వైఎస్ జగన్.. అన్నీ తెలిసి కూడా ఎందుకీ మౌనం..!?
ABN , First Publish Date - 2023-04-06T20:55:46+05:30 IST
ఆంధ్రప్రదేశ్ అంటే.. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి (BJP Govt) ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీపైన బీజేపీ.. బీజేపీపైన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ అంటే.. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి (BJP Govt) ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీపైన బీజేపీ.. బీజేపీపైన వైసీపీ (YSR Congress) ఓ రేంజ్‌లో ప్రేమను ఒలకబోసుకుంటూ ఉంటారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభలో వైసీపీ ప్రవర్తించిన తీరును ప్రజలంతా చూసే ఉంటారు. ఇక వైఎస్ జగన్ సర్కార్‌కు (YS Jagan Govt) ఎప్పుడు ఎలాంటి అవసరమొచ్చినా సరే నిమిషాల్లో అయిపోతూ ఉంటాయ్. ముఖ్యంగా అప్పులు విషయానికొస్తే.. అప్పు కావాలని జగన్ అడగడమే ఆలస్యం.. నిమిషాల్లోనే అప్పులు పుడుతున్నాయ్ అని వార్తా పత్రికలు, టీవీ ఛానెల్స్‌లో చాలా కథనాలు చూసే ఉంటాం. ఇదొక్కటే కాదు ఏపీలో ఏం జరిగినా ఆఖరికి శాంతి భద్రతలు క్షీణించినా కూడా కేంద్రం ఇసుమంత మాట అనదు. పోనీ ఇవన్నీ ప్రధాని మోదీకి తెలియకుండానే జరుగుతున్నాయా అంటే అబ్బే అదేమీ లేదే.. మరి అలాంటిది జగన్ ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా మోదీ ఎందుకు ప్రవర్తిస్తున్నట్లు..? ఇప్పుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇంతకీ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఏపీ గురించి మోదీ ఏమన్నారు..? అన్నీ తెలిసిన మోదీనే ఎందుకింత మౌనంగా ఉన్నారు..? అసలు ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..!
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మునుపటితో పోలిస్తే ఊహించని రీతిలోనే అప్పులు పెరిగిపోయాయని, శాంతి భద్రతలు క్షీణించిపోయాయని.. ప్రతిరోజూ ప్రతిపక్ష పార్టీల నేతలు మీడియా ముందు తిట్టిపోస్తూనే ఉన్నారు. అంతేకాదు.. ఏపీకి అప్పు ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఇవ్వాలని లేకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఆపై ఎవరూ కాపాడలేరని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కుండబద్దలు కొట్టి చెప్పిన విషయం విదితమే. అయినా సరే.. ‘కేంద్రం మాత్రం మేం ఇచ్చుడే.. జగన్ తీసుకునుడే’ అన్నట్లుగా వ్యవహారం ఉంది. ఏపీ గురించి ఎవరేమనుకున్నా ఫర్లేదు.. అసలు ఏపీ పరువు మంటగలిసిపోయినా పర్లేదు.. ఏ రాష్ట్రానికి పట్టని దుస్థితి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినా కానీ అప్పులు ఇవ్వడంలో అటు రిజర్వ్ బ్యాంక్ (RBI).. ఇటు మోదీ సర్కార్ ఏ మాత్రం వెనుకాడట్లేదని వార్తలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పగా మారుతోందని ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు మొత్తుకుంటున్నారు. ఈ మధ్యనే పార్లమెంట్ (Parliament) సాక్షిగా ఏపీ అప్పులను కేంద్రం బయటిపెట్టింది. రిజర్వ్ బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వం (AP Govt) మరో రూ.958 కోట్లు అప్పు తెచ్చింది. 7.70 శాతం వడ్డీతో ఆరేళ్లకు బాండ్ల వేలం ద్వారా ఈ రుణం తీసుకుంది. ఇటీవల ఎఫ్ఆర్బీఎం (FRBM) కింద నాలుగోసారి అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఈ మధ్య తీసుకున్న అప్పుతో ఎఫ్ఆర్బీఎం కింద ఇచ్చిన అనుమతి మొత్తం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరంలో నాలుగుసార్లు ఇచ్చిన రుణం, నాబార్డు, లిక్కర్ బాండ్లతో కలుపుకొని మొత్తం రూ. 87,758 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పు చేసినట్టయ్యింది. 2019లో రూ.2,64,451 కోట్లు ఉండగా.. 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉంది. సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు చేస్తోందని పార్లమెంట్ వేదికగా పంకజ్ చౌదరి పూసగుచ్చినట్లుగా వివరాలు వెల్లడించారు. అయితే వైసీపీ మాత్రం పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పుడు ప్రభుత్వం అప్పులు చేయడం సహజమని చెబుతోంది. ఇన్ని లెక్కలు తీసి మరీ చెప్పేది కేంద్రమే.. మళ్లీ అప్పులు తీసుకోవడానికి అప్రూవల్ చేసేది కూడా అదే కేంద్ర ప్రభుత్వమే.. చూశారుగా పరిస్థితి ఎలా ఉందో.!
మోదీ ఇన్ని మాటలు అన్నారా..!?
ఇటీవల కుటుంబ సమేతంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) .. ప్రధాని మోదీని కలిశారు. సుమారు అరగంటకు పైగా ఏపీ పరిస్థితులు, తాజా పరిణాలపై చర్చించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను కనకమేడల ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏపీ పరిస్థితిపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అసలు సమావేశంలో భాగంగా ఏమేం చర్చించారనేది మీడియా ముందుకొచ్చి కనకమేడల చెప్పారు. ‘పంజాబ్ మాదిరిగా ఏపీ మారింది. శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి. ఏపీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసని మోదీ అన్నారు. అన్ని విషయాల్లో ఏపీ పంజాబ్‌లా తయారైంది అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఆర్ధిక, శాంతి భద్రతల పరిస్థితులు నా దృష్టిలో ఉన్నాయి’ అని ప్రధాని కామెంట్స్‌ను కనకమేడల మీడియా ముఖంగా వెల్లడించారు. అంతేకాదు.. ఏపీలో ఈ రకమైన పరిస్థితులు దేశాభివృద్ధికి దోహదం చేయదని, రాష్ట్రాన్ని మీరే రక్షించాలని కూడా మోదీని కోరినట్లు రవీంద్ర తెలిపారు.
అసలేంటీ పంజాబ్‌తో ఏపీకి పోలిక..!
పంజాబ్‌లో (Punjab) ప్రభుత్వం మారిన తర్వాత ఆర్థికంగా, శాంతిభద్రతల పరంగా పరిస్థితులు సర్లేవు. ముఖ్యంగా ఆప్ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్, రౌడీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. అంతేకాదు.. సింగర్ మూసేవాలా హత్య (Moosewala Murder) , ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం పేరుతో అమృత్‌పాల్ సింగ్ (Khalistan Amritpal Singh) వ్యవహారం దేశంలో పెను సంచలనమే సృష్టించాయి. అమృత్ పాల్ పారిపోతే 80 వేల మంది పోలీసులు ఉండి ఏం చేస్తున్నారని కోర్టులే ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈ రెండు పరిణామాలతో పంజాబ్ అట్టుడికిపోయింది. అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేవా.. అనే అనుమానాలు సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అనుమానాలు వచ్చిన పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రపంచం మొత్తం పంజాబ్ వైపే చూసింది. ఇంత జరిగినా పంజాబ్ సర్కార్ మాత్రం ఇంకా మొద్దునిద్రలో ఉండటం గమనార్హం. పైగా ఆప్ అధిపతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మాత్రం పంజాబ్ సర్కార్‌ను పొల్లెత్తి మాట అనకుండా ప్రశంసల జల్లు కురిపించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక అప్పుల పరంగా అయితే.. ఇందులోనూ ప్రభుత్వం ఏమీ తక్కువ లేదు. ఈ మధ్య ఏపీలో కూడా జరిగిన కొన్ని పరిణామాలు కూడా పంజాబ్ పరిస్థితులను తలపించేలా ఉన్నాయన్నది బహుశా మోదీ భావన ఏమో..! అందుకే ఇలా ఏపీని పంజాబ్‌తో పోల్చారేమో మరి.
సడన్‌గా ఎందుకిలా..!?
ఇలా పెద్ద వ్యక్తులతో మీటింగ్ జరిగాక కొన్ని మీడియా ముందు చెప్పేవి ఉంటాయి.. మరికొన్ని చెప్పకూడనివి కూడా ఉంటాయ్. ఒకవేళ సమావేశంలో చర్చకు రాని విషయాలు మీడియా ముందు చెబితే.. అది కూడా మోదీ లాంటి వ్యక్తులతో భేటీ తర్వాత ఇలా అస్సలు మాట్లాడరు. ఇప్పుడు కనమేడల మాటలను ఒకటికి పదిసార్లు వైసీపీ అధిష్ఠానం ఆలోచించినప్పటికీ ఏమీ తోచట్లేదట. నిన్న, మొన్నటి వరకూ సత్సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ సడన్‌గా మోదీ ఎందుకిలా అన్నారబ్బా అని వైఎస్ జగన్ డైలామాలో పడ్డారట. ఏపీలో ఏం జరుగుతోంది..? ఎవరేం చెప్పారు..? అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి..? అని ఓ నివేదికను త్వరలోనే అందజేయాలనే భావనలో వైసీపీ ఉందని టాక్ నడుస్తోంది. అవసరమైతే ప్రత్యేకంగా ఒకరిద్దరు ఎంపీలు వెళ్లి ప్రధానిని కలవాలని జగన్ సూచించారట. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మోదీ చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఎవరేం తక్కువ కాదు..!
అప్పులు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఏమీ తక్కువ కాదు.. నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ.10 కోట్ల అప్పు చేస్తుంటుందని ఇప్పటికే వార్తలు కోడై కూశాయి. కేంద్రం ప్రతి క్షణానికి రూ.5.34 లక్షల అప్పు చేస్తున్నదని లెక్కలతో సహా బయటికొచ్చాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాదిపాటు కష్టపడితే వచ్చే సంపాదనకు సమానమైన అప్పును కేంద్రం ఒక్క సెకనులో చేసేస్తున్నదన్న మాట. అప్పుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇలాంటి లెక్కలు వైసీపీ సోషల్ మీడియా బయటికి తీసి.. ఎవరేం తక్కువ కాదు.. అంటూ నానా రచ్చ చేస్తుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వైసీపీ-బీజేపీ రాసుకుని పూసుకుని తిరగడం వల్లే ఏపీలో కమలం పరిస్థితి అంతంత మాత్రమే ఉందనే ఆరోపణలు లేకపోలేదు. ఆ మధ్య అమరావతి ఆందోళనల్లో ఏపీ బీజేపీ వైఖరిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కన్నెర్రజేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీలో బీజేపీ తన రూట్ మార్చుకుంది.
మొత్తానికి చూస్తే.. మోదీ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకూ బీజేపీ-వైసీపీ మధ్య తెరవెనుక మైత్రి ఉందని టాక్ నడిచినప్పటికీ ఇప్పుడు మోదీ కామెంట్స్‌తో ఇందులో నిజానిజాలెంత అనే కొత్త చర్చ వెలుగులోకి వస్తోంది. వైసీపీ నేతలు ఇంతవరకూ ఈ వ్యవహారంపై స్పందించకుండానే మౌనం పాటిస్తున్నారు. ఇన్ని తెలుసుకున్న మోదీ ఫైనల్‌గా ఏం చేస్తారో.. ఈ వ్యవహారంపై వైఎస్ జగన్ ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.