Apps ban: కేంద్రం మరో సంచలనం..232 యాప్స్ బ్యాన్, బ్లాక్.. ఏపీ, తెలంగాణలో...
ABN , First Publish Date - 2023-02-05T16:39:18+05:30 IST
దేశంలో రుణ యాప్‌ల (Loan Apps) ఆగడాలు, బెట్టింగ్ యాప్‌ల (Betting Apps) పర్యవసనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: దేశంలో రుణ యాప్‌ల (Loan Apps) ఆగడాలు, బెట్టింగ్ యాప్‌ల (Betting Apps) పర్యవసనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ దేశం చైనా (China) మూలాలున్న 138 బెట్టింగ్ యాప్స్ (Betting apps), 94 రుణ యాప్‌లపై (Loan apps) నిషేధం (Ban), మరికొన్నింటిని బ్లాక్ (Black) చేయాలనే నిశ్చయించింది. మొత్తం 232 యాప్స్‌పై తక్షణ, అత్యవసర ప్రాతిపదికన ఈ చర్యకు సిద్ధమైనట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఈ నిర్ణయం జరిగిందని, యాప్‌ల బ్లాక్‌కు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కింద భారత సార్వభౌమత్వం, సమగ్రత పట్ల పక్షపాతంగా వ్యవహరించే ఉద్దేశాలను ఈ యాప్‌లలో గుర్తించడంతో ఈ చర్య తీసుకున్నట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ యాప్‌లను చైనా పౌరులే రూపొందించారని, భారత్‌లో ఇక్కడేవారినే డైరెక్టర్లుగా నియమించుకుని దా‘రుణా’లకు పాల్పడుతున్నాయని అధికారులు ఇదివరకే గుర్తించారు.
కాగా లోన్ యాప్‌లు అమాయకులను రుణాల పేరిట దోపిడీకి గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. భారీ వడ్డీ రేట్లు విధిస్తున్నాయి. ఆ వడ్డీలను చెల్లించలేని రుణగ్రస్థులను యాప్‌ల ప్రతినిధులు వేధింపులకు గురిచేస్తున్నారు. అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను కాంటాక్ట్ నంబర్లకు పంపించి అవమానానికి గురిచేస్తున్నాయని ఐటీ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పలువురు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన పలు ఘటనలు వెలుగుచూశాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది.
కాగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆరు నెలలక్రితం 28 లోన్ యాప్‌లపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో 94 యాప్‌లు థర్డ్-పార్టీ లింక్స్ ద్వారా ఈ-స్టోర్స్‌లో లభ్యమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. కాగా దేశ భద్రతకు ప్రమాదకరమనే కారణంగా గతంలోనూ పలు చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. జూన్ 2020 నుంచి ఇప్పటికే 200లకుపైగా చైనీస్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్‌ఇట్, వీచాట్, హెలో, లైకీ, యూసీ న్యూస్, బిగో లైవ్, యూసీ బ్రౌజర్స్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఎంఐ కమ్యూనిటీ సహా పలు యాప్‌లు ఉన్నాయి.