Asia Cup 2023: ఆసియా కప్ మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా? మరి విదేశాల్లో ఉన్న వారి సంగతేంటి?..
ABN , First Publish Date - 2023-08-29T16:11:38+05:30 IST
ఆసియా కప్ మ్యాచ్‌లను ఎక్కడ చూడాలని క్రికెట్ అభిమానులు తెగ ఆరాతీస్తున్నారు. అలాగే మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశాల కోసం కూడా తెగ వెతుకుతున్నారు.
క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తి ఎదురుచూస్తున్న ఆసియాకప్‌నకు సమయం ఆసన్నమైంది. శ్రీలంక, పాకిస్థాన్ వేదికలుగా బుధవారం నుంచే ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ తలపడనున్నాయి. ఇక భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. అయితే ఆసియా కప్ మ్యాచ్‌లను ఎక్కడ చూడాలని క్రికెట్ అభిమానులు తెగ ఆరాతీస్తున్నారు. అలాగే మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశాల కోసం కూడా తెగ వెతుకుతున్నారు. ఆసియా కప్ టోర్నీ మొత్తాన్ని ప్రముఖ క్రీడా ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్(Star Sports Network) టీవీల్లో ప్రసారం చేయనుంది. తెలుగు కామెంట్రీ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో హాయిగా ఇంట్లో కూర్చొని కుటుంబంతో మ్యాచ్‌లను వీక్షించొచ్చు. ఇక మొబైల్ వినియోగదారులు కూడా మ్యాచ్‌లు చూడడానికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. స్టార్ స్పోర్ట్స్‌కే చెందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్ స్టార్(Disney + Hotstar) ఆసియా కప్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. అది కూడా ఉచితంగా కావడం గమనార్హం. ఈ విషయాన్ని డిస్నీ+హాట్ స్టార్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో మొబైల్ వినియోగదారులు తాము ఉన్న చోటు నుంచి హాట్ స్టార్ యాప్‌లో మ్యాచ్‌లను వీక్షించొచ్చు. హాట్‌స్టార్‌లో కూడా తెలుగు కామెంట్రీ అందుబాటులో ఉంటుంది.
అయితే ఇది భారతదేశంలో ఉన్న వారికి మాత్రమే. ఇతర దేశాల్లో ఉన్న వారు మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్ స్టార్‌లో వీక్షించలేరు. పాకిస్థాన్‌లో ఉండే వారు పీటీవీ స్పోర్స్, టెన్ స్పోర్ట్స్‌లో.. బంగ్లాదేశ్‌లో ఉండే వారు గాజీ టీవీలో ఆసియా కప్ మ్యాచ్‌లను చూడొచ్చు. యూకే, ఐర్లాండ్‌లో ఉండే వాళ్లు టీవీల్లో అయితే టీఎన్‌టీ స్పోర్ట్స్ 1లో, మొబైల్ ఫోన్‌లలో టీఎన్‌టీ స్పోర్ట్స్ యాప్‌లో.. ఆస్ట్రేలియాలో ఉండేవాళ్లు టీవీల్లో అయితే ఫాక్స్ స్పోర్ట్స్ ఛానెల్‌లో, మొబైల్ ఫోన్‌లలో ఫాక్స్‌టెల్ యాప్‌లో మ్యాచ్‌లను వీక్షించొచ్చు. ఇక న్యూజిలాండ్‌లో ఉండే వాళ్లు స్కైస్పోర్ట్స్‌లో, సౌతాఫ్రికాలో ఉండే వాళ్లు సూపర్ స్పోర్ట్ నెట్‌వర్క్‌లో, యూఎస్‌ఏలో ఉండే వాళ్లు విల్లో టీవీలో, ఆప్ఘనిస్థాన్‌లో ఉండే వాళ్లు అరియానా టీవీలో ఆసియా కప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని వారికి మాత్రమే మ్యాచ్‌లను మొబైల్ ఫోన్‌ల ద్వారా ఓటీటీలో కూడా చూసే అవకాశం ఉంది. మిగతా దేశాల వారికి ఆసియా కప్ మ్యాచ్‌లు టీవీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.