Asia Cup 2023: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం

ABN , First Publish Date - 2023-08-30T18:27:05+05:30 IST

బంగ్లాదేశ్ జట్టుకు తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు వైరల్ ఫీవర్ కారణంగా లిట్టన్ దాస్ కూడా లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది.

Asia Cup 2023: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం

ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేయాలని భావిస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గురువారం పల్లెకెలె వేదికగా శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడాల్సి ఉండగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్ కారణంగా దూరమయ్యాడు. ఫిట్‌నెస్ లేకపోవడంతో టోర్నీ మొత్తానికి లిట్టన్ దాస్ దూరంగా ఉండనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో లిట్టన్ దాస్ స్థానంలో అనముల్ హక్‌ను తీసుకుంటున్నట్లు తెలిపింది. తొలుత టోర్నీ ప్రారంభం నాటికి లిట్టన్ దాస్ కోలుకుంటాడని బంగ్లాదేశ్ జట్టు భావించింది. కానీ అతడు కోలుకోలేకపోవడంతో ఆసియా కప్ మొత్తానికి దూరమయ్యాడు. అనుభవజ్ఞుడైన లిట్టన్ దాస్ లేకపోవడం బంగ్లాదేశ్ టీమ్‌కు చేదువార్త అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: Jasprit Bumrah: భార్యతో కలిసి ‘ఫిఫా’ ఆడిన టీమిండియా పేసర్.. వీడియో వైరల్

ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టుకు తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు లిట్టన్ దాస్ కూడా లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది. 2022 ప్రారంభం నాటికి లిట్టన్ దాస్ 25 ఇన్నింగ్స్‌ల్లో 41 సగటుతో 878 పరుగులు చేసి ODIలలో బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. కాగా లిట్టన్ దాస్ స్థానంలో ఎంపికైన అనముల్ హక్ బంగ్లాదేశ్ తరఫున ఇప్పటివరకు 41 వన్డేలు ఆడి 1254 పరుగులు సాధించాడు. అతడి సగటు 30.54, స్ట్రయిక్ రేట్ 74. చివరగా గత ఏడాది డిసెంబర్‌లో టీమిండియాపై చివరి వన్డే ఆడాడు. కాగా తొలిసారిగా ఆసియా కప్ గెలవాలన్న కసితో ఈనెల 27న బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక చేరుకుంది. గ్రూప్-బిలో ఉన్న ఆ జట్టు లీగ్ దశలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లతో ఆడాల్సి ఉంది. ఆగస్టు 31న శ్రీలంకతో పల్లెకెలెలో తమ ఆరంభ మ్యాచ్‌లో తలపడి సెప్టెంబర్ 3న లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనుంది.

Updated Date - 2023-08-30T18:28:22+05:30 IST