Share News

IPL 2024 Auction: వేలంలో ఆల్‌ టైమ్ రికార్డు ధర తర్వాత మిచెల్ స్టార్క్ ఏమన్నాడంటే..?

ABN , Publish Date - Dec 20 , 2023 | 11:20 AM

Mitchell Starc: ఐపీఎల్ 2023 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. స్టార్క్‌ను ఏకంగా రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.

IPL 2024 Auction: వేలంలో ఆల్‌ టైమ్ రికార్డు ధర తర్వాత మిచెల్ స్టార్క్ ఏమన్నాడంటే..?

దుబాయ్: ఐపీఎల్ 2023 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. స్టార్క్‌ను ఏకంగా రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ చివరకే కోల్‌కతానే దక్కించుకుంది. అయితే 8 ఏళ్లుగా ఐపీఎల్ ఆడని స్టార్క్‌పై కోల్‌కతా మేనేజ్‌మెంట్ ఇంత భారీ ధర పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక వేలంలో తనను కోల్‌కతా భారీ ధరకు దక్కించుకోవడంపై మిచెల్ స్టార్క్ తొలిసారి స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కేకేఆర్‌లో చేరినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని స్టార్క్ చెప్పుకొచ్చాడు. ఈడెన్ గార్డెన్స్‌కు వెళ్లడానికి తాను వేచి ఉండలేకపోతున్నట్టు తెలిపాడు. భారీ ధర ఒత్తిడి కల్గించేదే అయినప్పటికీ తనకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉందని చెప్పాడు.


‘‘హే, కేకేఆర్ అభిమానులు. ఈ ఏడాది ఐపీఎల్‌లో చేరినందుకు థ్రిల్లింగ్‌గా ఉంది. అభిమానులు, సొంత ప్రేక్షకుల వాతావరణాన్ని అనుభవించడానికి, ఈడెన్ గార్డెన్స్‌కు వెళ్లడానికి నేను వేచి ఉండలేకపోతున్నాను. జట్టులో చేరడానికి ఎదురు చూస్తున్నాను. అమీ కేకేఆర్. నేను ఐపీఎల్ ఆడి చాలా కాలం అయింది. కానీ వేలంలో నా పేరు ఉండడం, కేకేఆర్‌లో చేరడం పట్ల చాలా సంతోషిస్తున్నాను. నా ధర చూసి నేను షాక్‌కు గురయ్యాను. నా భార్య అలిస్సా హీలీ ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ప్రస్తుతం భారతదేశంలోనే ఉంది. కాబట్టి ఆస్ట్రేలియాలో వారి కవరేజ్ నా కంటే కొంచెం ముందుగా ఉందని నేను భావిస్తున్నాను. నేను స్క్రీన్‌పై చూడడానికి ముందే నాకు అప్‌డేట్‌లు వస్తున్నాయి. నిజంగా ఇది చాలా బాగుంది. ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత మొత్తాన్ని నేను ఊహించలేదు. విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ ధర కావడంతో ఒత్తిడి సహజమే. కానీ నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఆడనుండడం, కేకేఆర్‌లో చేరినందుకు చాలా సంతోషిస్తున్నాను. ’’ అని కేకేఆర్ పోస్ట్ చేసిన వీడియోలో స్టార్క్ తెలిపాడు.

కాగా ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో చివరగా 2015లో ఆడాడు. ఆ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాతి నుంచి పలు కారణాలతో ఐపీఎల్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. 2018లో కూడా స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసినప్పటికీ గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇక ఐపీఎల్ ఇప్పటివరకు 27 మ్యాచ్‌లాడిన స్టార్క్ 34 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్ అయినా స్టార్క్ ఇటీవల కంగారులు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Updated Date - Dec 20 , 2023 | 11:20 AM