Asia Cup 2023: అన్ని మ్యాచ్‌లు పూర్తవుతున్నాయి.. దాయాదుల మ్యాచ్‌లపైనే వరుణుడి పగ ఎందుకు?
ABN , First Publish Date - 2023-09-11T14:00:33+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులతో పాటు వరుణుడు కూడా ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను మాత్రమే టార్గెట్ చేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లు వర్షార్పణం అవుతుండటంతో అటు టీమిండియా, ఇటు పాకిస్థాన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఆసియా కప్ 2023 జరుగుతున్న తీరు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు టోర్నీలో 9 మ్యాచ్‌లు జరగ్గా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే రద్దయ్యాయి. ఆ రెండు మ్యాచ్‌లు భారత్-పాకిస్థాన్‌వే కావడం గమనించాల్సిన విషయం. ఏడాది తర్వాత దాయాదులు పోటీపడుతుండటంతో రెండు దేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూడగా.. వరుణుడు కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లపైనే కన్నేశాడు. దీంతో మిగతా ఏడు మ్యాచ్‌లు సవ్యంగానే పూర్తి కాగా దాయాదుల మ్యాచ్‌లు మాత్రం వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్ రద్దు కావడంతో అంపైర్లు రెండు జట్లకు చెరో పాయింట్‌ను పంచారు. ఇప్పుడు సూపర్-4లోనూ అలాంటి పరిస్థితే నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులతో పాటు వరుణుడు కూడా ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను మాత్రమే టార్గెట్ చేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లు వర్షార్పణం అవుతుండటంతో అటు టీమిండియా, ఇటు పాకిస్థాన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా సూపర్-4లో ఆదివారం నాటి మ్యాచ్ ఎంతో ఆసక్తి రేపింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. లీగ్ దశ మ్యాచ్ మాదిరి కాకుండా ఈసారి భారత ఓపెనర్లు ఆచితూచి ఆడారు. రోహిత్ నెమ్మదిగా ఆడగా.. శుభ్‌మన్ గిల్ మాత్రం షాహిన్ షా అఫ్రిదిని టార్గెట్ చేసి బౌండరీల మోత మోగించాడు. దీంతో ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 16.4 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం షాదాబ్ ఖాన్ ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. రోహిత్ శర్మ (56)ను అతడు అవుట్ చేశాడు. వెంటనే గిల్ (58) కూడా పెవిలియన్ బాట పట్టడంతో 123 పరుగులకు భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వరుణుడు కూడా రంగప్రవేశం చేసి ఆటను అడ్డుకున్నాడు. రిజర్వ్ డే ఉండటంతో అంపైర్లు ఆటను వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: నాడు స్టాండ్స్‌లో ఎగిరి.. నేడు విజేతగా నిలిచి!
అయితే రిజర్వు డే రోజు కూడా కొలంబోలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మ్యాచ్ మొదలయ్యే సమయానికి 50 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత వర్షం పడే అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రానికి వర్షం పడే అవకాశం 80 శాతానికి పెరుగుతోందన్నారు. దీంతో రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ ఆసాంతం జరిగే సూచనలు కనిపించడం లేదు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిగితేనే డక్‌వర్త్ లూయిస్ విధానంలో విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ కనీసం 20 ఓవర్లు కూడా జరగకపోతే ఈ మ్యాచ్‌ను కూడా అంపైర్లు రద్దు చేస్తారు. ఇదే జరిగితే వరుసగా రెండోసారి కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియనుంది.