Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి ఇన్నింగ్స్.. శ్రీలంక ఎదుట కొండంత లక్ష్యం
ABN , First Publish Date - 2023-01-07T20:51:09+05:30 IST
సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో భారత్ చెలరేగిపోయింది. శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడింది. చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ దెబ్బకు లంక బౌలర్లు బెంబేలెత్తారు
రాజ్‌కోట్: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20లో భారత్ (Team India) చెలరేగిపోయింది. శ్రీలంక (Sri Lanka) బౌలర్లను చీల్చి చెండాడింది. చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) దెబ్బకు లంక బౌలర్లు బెంబేలెత్తారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే మైదానంలో ప్రేక్షకులైపోయారు. బౌండరీలు దాటిన బంతులను అందించేందుకే పరిమితమయ్యారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభం ఏమంత కలిసిరాలేదు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) అండగా శుభమన్ గిల్ (Shubman Gill) బ్యాట్‌కు పనిచెప్పాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. మరోవైపు, త్రిపాఠి కూడా బ్యాట్ ఝళిపించాడు. ఇద్దరూ కలిసి క్రీజులో కుదురుకుపోయిన వేళ త్రిపాఠిని కరుణరత్నె బోల్తా కొట్టించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన త్రిపాఠి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఇక, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. సూర్య బాదుడుతో స్కోరు బోర్డు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఈ క్రమంలో సూర్యకుమార్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా భారత్ తరపున అత్యంత వేగంగా టీ20 సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
అంతకుముందు రోహిత్ శర్మ ఇండోర్‌లో ఇదే శ్రీలంకపై 35 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా 51 బంతులు ఆడిన సూర్య 7 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 112 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ 9 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసి స్కోరు బోర్డు 220 పరుగులు దాటడంలో తనవంతు సాయం చేశాడు. శుభమన్ గిల్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక 2 వికెట్లు తీసుకున్నాడు.