Twitter Shocks Cricketers: కోహ్లీ, ధోనీ, రోహిత్‌కు షాకిచ్చిన ట్విట్టర్
ABN , First Publish Date - 2023-04-21T16:13:39+05:30 IST
ఇండియా క్రికెట్ త్రయం విరాట్ కోహ్లీ(Virat Kohli), ఎంఎస్ ధోనీ(MS Dhoni), రోహిత్ శర్మ(Rohit
న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్ త్రయం విరాట్ కోహ్లీ(Virat Kohli), ఎంఎస్ ధోనీ(MS Dhoni), రోహిత్ శర్మ(Rohit Sharma)కు ట్విట్టర్(Twitter) షాకిచ్చింది. ఈ ఉదయం తమ ట్విట్టర్ ఖాతాలను చూసుకున్న వీరు ముగ్గురు ఏదో తేడాను గమనించారు. ఆ వెంటనే వారికి అర్థమైంది.. తమ ప్రొఫైల్ పక్కన ఉండాల్సిన బ్లూటిక్ మాయమైందని. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్న తర్వాత మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ట్విట్టర్ వెరిఫైడ్ బ్లూటిక్(Blue Tick) కావాలనుకున్నవారు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందేనని మస్క్ తొలుత ప్రకటించారు. అయితే, ధోనీ, రోహిత్, కోహ్లీ, ఇతర ట్విట్టర్ యూజర్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకోలేదు. ఫలితంగా వారి ప్రొఫైల్స్ నుంచి తాజాగా బ్లూటిక్ ఎగిరిపోయింది.
వెరిఫైడ్ బ్లూటిక్ కోసం యూజర్లు డబ్బులు చెల్లించాల్సిందేనని, చెల్లించని వారి ప్రొఫైల్స్ నుంచి బ్లూటిక్ మార్క్‌ను తీసేస్తామని ట్విట్టర్ ఇటీవల తెలిపింది. అంతకుముందు వెరిఫికేషన్ టిక్ ఇవ్వడానికి వేరే కారణం ఉందని కూడా పేర్కొంది. కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, ఇతర క్రికెటర్లకు ఉన్న ‘లెగసీ బ్లూటిక్’ కారణంగా ట్విట్టర్‌లో వారు మరింతగా దూసుకుపోతున్నారు. అయితే, శుక్రవారం ఉదయం వారి ప్రొఫైల్స్ నుంచి అకస్మాత్తుగా అవి మాయమయ్యాయి.
ట్విట్టర్ మస్క్ చేతికి చిక్కాక బ్లూటిక్ పెయిడ్ సర్వీస్‌గా మారింది. యూజర్లకు బ్లూటిక్ కావాలంటే ఇండియాలో అయితే నెలకు రూ. 900 సమర్పించుకోవాల్సిందే. అదే వెబ్‌లో అయితే ఈ ఫీజు నెలకు రూ. 650గా ఉంది. రూ. 6,800 చెల్లించి ఏడాది పాటు ట్విట్టర్ ప్రీమియం సేవలను పొందొచ్చు. అంటే నెలకు దాదాపుగా రూ. 566 పడుతుందన్నమాట. అయితే, ఈ ప్లాన్ వెబ్‌కు మాత్రమే పరిమితం. అదే అమెరికాలో అయితే నెల 11 డాలర్లు, వెబ్‌కి అయితే 8 డాలర్లు చెల్లించాలి. వార్షిక ప్లాన్ ధర 84 డాలర్లు.
ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు తదితరులకు ట్విట్టర్ గతంలో తనంత తానుగానే బ్లూటిక్ ఇచ్చేది. అయితే, ఇప్పుడు దానిని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్లు 4 వేల కేరెక్టర్ల వరకు టెక్ట్స్ పంపించుకోవచ్చు. అదే, ఇతరులు మాత్రం 280 కేరెక్టర్లకు మించి పంపలేరు. అంతేకాదు, బ్లూ సబ్‌స్క్రైబర్లు 60 నిమిషాల నిడివి ఉన్న వీడియో లేదంటే 2జీబీ వరకు ఉన్న వీడియోను కూడా పంపుకోవచ్చు.