World Cup: పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరాలంటే ఉన్న దారులివే!
ABN , First Publish Date - 2023-10-26T13:32:59+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. మొత్తంలో 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశాలు నాలుగు జట్లకే దక్కుతుంది. దీంతో లీగ్ దశ పూర్తయ్యే నాటికి టాప్ 4లో ఉన్న జట్లు నాకౌట్ పోరుకు అర్హత సాధిస్తాయి.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. మొత్తంలో 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశాలు నాలుగు జట్లకే దక్కుతుంది. దీంతో లీగ్ దశ పూర్తయ్యే నాటికి టాప్ 4లో ఉన్న జట్లు నాకౌట్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఇప్పటివరకు ఏ ఒక్క జట్టుకు కూడా నాకౌట్ బెర్త్ ఖరారు కానప్పటికీ భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఈ రేసులో ముందున్నాయి. అయితే చివరి వరకు వీటి స్థానాల్లో కూడా మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 1992 వరల్డ్ కప్ ఛాంపియన్ పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. టోర్నీ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీద కనిపించిన పాకిస్థాన్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేసులో వెనుకబడింది. గత మ్యాచ్‌లో పసికూన అఫ్ఘానిస్థాన్ చేతిలో కూడా ఓడిపోవడంతో ఆ జట్టుపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరైతే బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. లీగ్ దశలో పాక్‌కు ఇంకా 4 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పాకిస్థాన్ సెమీస్‌లో అడుగుపెట్టాలంటే అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే..
పాకిస్థాన్ తమ తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 6 విజయాలు ఉంటాయి. దీంతో 12 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తమ రన్‌రేటును కూడా మెరుగుపరచుకుంటే పాకిస్థాన్‌కు ఇబ్బందులు ఉండకపోవచ్చు. పైగా మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో కనుక పాక్ గెలిస్తే న్యూజిలాండ్, సౌతాఫ్రికాలను ఆ జట్టు ఓడిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్నాయి. ఒకవేళ పాక్ చేతిలో ఓడితే వాటి స్థానాలు దిగజారే అవకాశాలుంటాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్, భారత్ చేతిలో సౌతాఫ్రికా కూడా ఓడిపోతే పాకిస్థాన్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. కానీ ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్థాన్ జట్టు తన తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు పెద్ద జట్లతోనే ఆడనుంది. తర్వాతి నాలుగు మ్యాచ్‌లను పాకిస్థాన్ వరుసగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో ఆడనుంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఆ నాలుగు మ్యాచ్‌ల్లో గెలవడం కష్టమనే చెప్పుకోవాలి. అలా అని పాకిస్థాన్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదు. ఎందుకంటే ఆ జట్టు తమదైన రోజున ఎంతటి పెద్ద టీంలనైనా ఓడిస్తుంది. కాబట్టి మిగిలిన 4 మ్యాచ్‌ల్లో గెలిస్తే పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిస్తే..
పాకిస్థాన్ తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. ఇదే జరిగితే టోర్నీలో పాకిస్థాన్ సెమీస్ చేరడం కష్టమవుతుంది. పైగా ఇతర జట్లు ఆడే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఆడే మిగతా 4 మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా రన్ రేటు కీలకం అవుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు మూడింట్లో ఓడితే పాకిస్థాన్ సెమీస్ చేరడానికి మంచి అవకాశాలుంటాయి. అప్పుడు పాకిస్థాన్‌కు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో సెమీస్ బెర్త్ దక్కుతుంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉన్న ఫామ్ దృష్యా చూస్తే ఇది జరగకపోవచ్చు. ఆస్ట్రేలియా తమ తర్వాతి 4 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇందులో అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ చిన్న జట్లే. ఇంగ్లండ్ కూడా సరైనా ఫామ్‌లో లేదు. దీంతో ఇది జరగడం కష్టమనే చెప్పుకోవాలి.
మిగతా 4 మ్యాచ్‌ల్లో రెండే గెలిస్తే..
పాకిస్థాన్ మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉంటాయి. దీంతో 8 పాయింట్లతో పాక్ నాకౌట్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. పైగా ఒక టోర్నీలో ఓ జట్టు తమకు కేటాయించిన మ్యాచ్‌ల్లో సగం కంటే తక్కువగా గెలిచి నాకౌట్ దశకు అర్హత సాధించడం అసంభవం. గతంలో ఒకే ఒకసారి ఇలా జరిగింది. 2019 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సగం కంటే తక్కువ మ్యాచ్‌లే గెలిచి ప్లేఆఫ్స్ చేరింది. ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు తమ 14 మ్యాచ్‌ల్లో 6 మాత్రమే గెలిచింది. పాకిస్థాన్‌కు కూడా ఇలా జరగాలంటే పాయింట్ల పట్టికలో చాలా మార్పులు జరగాల్సి ఉంటుంది. పైగా అది ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారఫడి ఉంటుంది. అలా కూడా కాకుండా మిగిలిన 4 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ ఒకటి గెలిచినా.. లేదంటే అన్ని ఓడిపోయిన సెమీస్ చేరే అవకాశాలు ఏ మాత్రం ఉండవు.