BJP: మోదీ, అమిత్‌షా ప్రచారం నిర్వహించినా ప్రయోజనం లేకపాయే... కిషన్‌రెడ్డి సొంతగడ్డపై రెండోసారి ఎదురుగాలి
ABN , First Publish Date - 2023-12-05T11:43:53+05:30 IST
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు రోడ్‌షోలు నిర్వహించినా అంబర్‌పేట(Amberpet) నియోజకవర్గ
హైదరాబాద్: (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు రోడ్‌షోలు నిర్వహించినా అంబర్‌పేట(Amberpet) నియోజకవర్గ ప్రజలు బీజేపీని ఆదరించలేదు. బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ప్రజలు బీఆర్‌ఎస్(BRS) వైపు మొగ్గుచూపడం బీజేపీకి చుక్కెదురుగా నిలిచింది. బలమైన ఓటు బ్యాంకుతో విజయం సాధిస్తామని ధీమాలో ఉన్న బీజేపీ నేతలకు ఈ నియోజకవర్గ ప్రజలు బలమైన షాక్ ఇచ్చారు. మరో నాలుగు నెలల్లో ఎంపీ ఎన్నికలు రాబోతుండడంతో దీని ప్రభావం ఆ ఎన్నికలపై కూడా పడుతుందేమోనని కమలనేతలు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గం ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు బీజేపీకి షాక్ ఇవ్వడం గమనార్హం. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) మూడుసార్లుగా ఎమ్మెల్యేగా గెలవగా నాలుగోసారి 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో 1067 ఓట్లతో ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేసిన సి.కృష్ణాయాదవ్ 1994, 1999లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 24,537 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే జి.కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయగా అంబర్‌పేట నియోజకవర్గ ప్రజలు 45 వేల ఓట్ల మెజారిటీ అందించారు.
అయితే మరో నాలుగు నెలల్లో 2024 ఏప్రీల్‌లో ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలపై ఎక్కడ ప్రభావం పడుతుందోనని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సి.కృష్ణాయాదవ్‌కు 49,879 ఓట్లు వచ్చాయి. కాలేరు వెంకటేష్ కంటే 24,537 ఓట్లు తక్కువ రావడం కమలనేతలను ఆందోళన కలిగిస్తోంది. నియోజకవర్గంలోని అంబర్‌పేట, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట డివిజన్లలో బీజేపీ ఓటు శాతం బాగా తగ్గింది. ఇక కాచిగూడ డివిజన్‌లో మాత్రమే ప్రజలు మెజారిటీ అందించారు. 15వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి 4,796, 16వ రౌండ్‌లో 5,120, 17వ రౌండ్‌లో 3,513 ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీలో ఉన్న కొంత మంది నేతలు పార్టీ పట్ల మనస్ఫూర్తిగా పనిచేయలేదనో ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోపాయికారిగా బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా వ్యవహరించినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి సొంత గడ్డపై భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం కమల నేతలకు మింగుడుపడడం లేదు.