TSPSC: టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం?
ABN , First Publish Date - 2023-03-18T10:57:33+05:30 IST
TSPSC బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ లీకేజ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సీరియస్‌గా ఉన్నట్లు
హైదరాబాద్: TSPSC బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ లీకేజ్‌పై(Paper leakage) ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. TSPSC చైర్మన్ జనార్ధన్‌రెడ్డిని(Janardhan Reddy) ప్రగతిభవన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన హుటాహుటిన ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ (kcr) మంత్రులు హరీష్‌రావు(Harish Rao), కేటీఆర్ (KTR)తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
కాగా, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)TSPSC ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1తోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం TSPSC (టీఎస్పీఎస్సీ) అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయంతో మొత్తం ఆరు పరీక్షలను రద్దు చేసినట్లయింది.
వాస్తవానికి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాకమొదట్లో ఒకటి రెండు పరీక్షలకు సంబంధించిన పేపర్లే లీక్ అయ్యాయని భావించారు. కానీ, సిట్ అధికారుల విచారణ, టీఎస్పీఎస్సీ అంతర్గత విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ పెన్‌డ్రైవ్‌లో పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో తాజాగా మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా 19 విభాగాల్లో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గతేడాది అక్టోబరు 16న 1019 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. సుమారు 2.86 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,050 మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేశారు. జూన్‌లో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ, ఇంతలోనే పేపర్ లీకేజీ వ్యవహారం బహిర్గతం కావడం, ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయడంతో.. ఇప్పటికే మెయిన్ పరీక్షకు ఎంపికై ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.