AP Politics: జగన్‌ను ఇంటికి తరిమిన జనం: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jun 13 , 2024 | 02:47 PM
ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లగొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో.. రాష్ట్రం నుంచి జగన్‌ను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఖాజానా మొత్తం ఖాళీ అయ్యిందని పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి: ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లగొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో.. రాష్ట్రం నుంచి జగన్‌ను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఖాజానా మొత్తం ఖాళీ అయ్యిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఖాజానా మాత్రం నిండుగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థకు పట్టిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భీమవరంలో మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికులపూడి గోవిందరావు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు తదితరులు కలిశారు. ఆ తర్వాత మంత్రి రామానాయుడు మాట్లాడారు.
రఘురామ కృష్ణ రాజుపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ అందరికీ రోల్ మోడల్‌గా నిలుస్తారని వివరించారు. గత ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దేనికైనా సిద్ధం అని అల్లూరి సీతారామరాజును గుర్తుకు తెచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు మాట్లాడుతూ.. మంత్రి రామానాయుడు సేవ గుణం కలిగిన వారని వివరించారు. ఆయనకు మంత్రి పదవి రావడం సముచిత నిర్ణయం అని అభిప్రాయ పడ్డారు. రామానాయుడు ప్రజల్లో ఉంటారని.. ఏ సమస్య వచ్చిన అందుబాటులో ఉండి పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. మంత్రిగా రామానాయుడు మంచిపేరు తెచ్చుకుంటారని వివరించారు.