AP Floods: అందుకే అక్కడికి వెళ్లలేదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్..
ABN , Publish Date - Sep 03 , 2024 | 09:09 PM
వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం తప్ప.. ఇందులో అర్థం లేదన్నారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో పర్యటించకపోయినా..
అమరావతి, సెప్టెంబర్ 03: వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం తప్ప.. ఇందులో అర్థం లేదన్నారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో పర్యటించకపోయినా.. అన్ని సహాయక కార్యక్రమాలను మానిటరింగ్ చేశానని చెప్పారు. ఆయా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశానన్నారు. ఇదే అంశంపై మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి పవన్.. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించారు.
ఇది ప్రకృతి విపత్తు..
‘నాలుగు రోజులుగా కురుస్థున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఉమ్మడి కృష్ణా జిల్లా మరింతగా ఎఫెక్ట్ అయ్యింది. ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఇలాంటి ఉవద్రవం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణ నుంచి వర్షాల వరద నీరు వచ్చింది. గత ప్రభుత్వం వారు ఏమీ చేయలేకపోయారు. అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఫ్లడ్ కెనాల్స్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం. బుడమేరు వాగును గత ప్రభుత్వం విస్మరించింది. అన్నమయ్య ప్రాజెక్ట్ పరిస్థితి చూశాం. చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. విజయవాడపై ప్రత్యేక కోణంలో దృష్టి పెట్టాలి. ఇది ప్రకృతి విపత్తు. రూ. 80 కోట్లు జిల్లాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఇలాంటి విపత్తులు రాకుండా ప్రతి సిటీకి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి.’ అని పవన్ చెప్పారు.
తోచినంత సాయం చేయండి..
‘సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 262 పంచాయతి రాజ్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. 1 లక్షా 72 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. 17,645 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయాయి. 2,851 కిలో మీటర్లు ఆర్ అండ్ బి రోడ్లు దెబ్బతిన్నాయి. వరద తగ్గుముఖం పట్టింది. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బుధవారం నాటికి 5 లక్షల క్యూసెక్కులు వరద నీరు వచ్చే అవకాశం వుంది. అతి తక్కువ సమయంలో ఎఫెక్టీవ్‌గా పని చేశాం. మూడు పార్టీల వ్యక్తులు కలిసి సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలి. నా వంతుగా కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ఉడుతలా సాయంగా ఇస్తున్నాను. రాష్ట్ర హితవు కోరే ప్రతి వ్యక్తి ఇలాంటి సమయంలో సహాయ పడాలి.’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించలేదు..
‘సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగకూడదనే నేను వరద ప్రాతాలలో పర్యటించలేదు. మా శాఖలు పని చేస్తున్నాయి. వరద బాదితులకు నేను ఎక్కడి నుంచి అయినా ధైర్యం చెప్పవచ్చు. అధికారుల సూచనల మేరకే నేను అక్కడికి వెళ్లలేదు. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వెళితే పరిస్థితి మరోలా ఉంటుందని భావించి.. వరద ప్రాంతాలకు వెళ్లలేదు. వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని చేస్తున్న విమర్శలు తప్ప వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు.’ అని పవన్ క్లారిటీ ఇచ్చారు.