Share News

AP Assembly: పులివెందుల పౌరుషం ఉంటే.. రా చూసుకుందాం

ABN , Publish Date - Nov 11 , 2024 | 05:30 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఆ క్రమంలో 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బడ్జెట్‌పై స్పందించారు.

AP Assembly: పులివెందుల పౌరుషం ఉంటే.. రా చూసుకుందాం
AP Minister BC Janardhan reddy

అమరావతి, నవంబర్ 11: వైఎస్ జగన్‌కు నీతి నిజాయితీ ఉంటే అసెంబ్లీకి హాజరుకావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. తప్పులు చేసినందుకే భయపడి.. వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని వైఎస్ జగన్‌కు మంత్రి సూచించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాడని.. అందుకే ప్రజలు ఆయన్ని పక్కన పెట్టారన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..


ప్రజలు పక్కన పెట్టినా వైఎస్ జగన్‌కు సిగ్గు రావడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ విద్వంసం సృష్టించిందని గుర్తు చేశారు. దీంతో పెట్టుబడి దారులు సైతం రాష్ట్రం నుంచి వెళ్లిపోయారన్నారు. ఇలాగే వైఎస్ జగన్ వ్యవహరిస్తే.. చివరకు ఒక సీటు కూడా ఆ పార్టీకి రాదని ఆయన జోస్యం చెప్పారు. పోర్టులన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారని గుర్తు చేశారు. అయితే అరబిందో కంపెనీ అనేది... వైఎస్ జగన్ బినామీ కంపెనీ అని మంత్రి బీసీ జానార్దన రెడ్డి ఆరోపించారు.

Also Read: AP Budget: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ


అలాగే అర్హత లేని కంపెనీకి పోర్టు పనులను వైఎస్ జగన్ అప్పగించారని విమర్శించారు. జగన్‌కు బినామీ కంపెనీలు ఉన్నాయి కాబట్టే ప్రజలు బినామీగా ఉండాలని తీర్పు నిచ్చారని ఆయన పేర్కొన్నారు. అయితే పోర్టులను ప్రైవేటు పరం చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కన్నతల్లికి, చెల్లికి వైఎస్ జగన్ అన్యాయం చేశాడంటూ మండిపడ్డారు. అందుకే రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఇక సాక్షి పత్రికలో తల్లిపైనా.. చెల్లిపైనా వై ఎస్ జగన్ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిపైనే ప్రభుత్వం కేసులు పెడుతుందని స్పష్టం చేశారు.


అయితే మీ లాగా తప్పుడు కేసులు పెట్టే మనస్తత్వం సీఎం చంద్రబాబు నాయుడిది కాదన్నారు. దమ్ము ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. జగన్‌కు పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేస్తున్నానన్నారు. ప్రజల పక్షాన పోరాడాలనుకుంటే అసెంబ్లీకి రావాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సూచించారు. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇక గత ఐదేళ్లలో వైసీపీ దరిద్ర పాలనలో రాష్ట్రంలోని రహదారులు పూర్తిగా ధ్వంసమై.. గుంతలమయమైపోయాయని మండిపడ్డారు. రహదారుల పనులకు సంబంధించి గత సర్కార్ రూ. 2300 కోట్లు బకాయిలు పెట్టి పోయిందని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్ స్నేహితుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏపీ రహదారులపై గతంలో వ్యంగ్యంగా మాట్లాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఐదేళ్ల పాలనలో సీఎంగా వైఎస్ జగన్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ‘గుంతల్లో చిడతల మేళం’ అంటూ రాష్ట్రంలోని రహదారులపై జగన్ పత్రిక తప్పుడు రాతలు రాశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయితే 2014-19 టీడీపీ పాలనలో రహదారుల అభివృద్దికి రూ.14,300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని గుర్తు చేశారు. ఆ క్రమంలో రూ.11 వేల కోట్లకు పైగా రహదారుల కోసం ఖర్చు చేశామని తెలిపారు. ఇక 2019-24లో వైసీపీ పాలనలో రహదారుల కోసం రూ.16,700 బడ్జెట్‌లో కేటాయించి.. కేవలం రూ.7,334 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా నిధులు ఖర్చు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇక జాతీయ రహదారులకు కేటాయించిన నగదును సైతం గత సీఎం వైఎస్ జగన్ మళ్లించిన విషయాన్ని మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్.. తన అవినీతి కర పత్రిక సాక్షిని అడ్డం పెట్టుకుని చిడతల మేళం వేస్తున్నారంటూ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఆ క్రమంలో 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బడ్జెట్‌పై స్పందిస్తూ.. పై విధంగా మాట్లాడారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 05:38 PM