CM Chandrababu: తిరుమలకు వెళ్లేవారు ఆ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Sep 27 , 2024 | 02:55 PM
తిరుమల(Tirumala) శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పష్టం చేశారు.
అమరావతి: తిరుమల(Tirumala) శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. శ్రీ వేంకట్వేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుమలకు వెళ్లే వారికి సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేస్తూ ట్వీట్ చేశారు.
" కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతీ భక్తుడూ అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంది. స్వామివారి సన్నిధికి వెళ్లే వారు ఆలయ నియమాలు, ఆగమశాస్త్ర ఆచారాలు, టీటీడీ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరుతున్నా. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః" అంటూ ట్వీట్ చేశారు.
జగన్.. తిరుమల పర్యటన రద్దు..
మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటికి ముగింపు పలికేందుకు ఆయన శుక్రవారం రోజున తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు మూడ్రోజుల క్రితం వైసీపీ ప్రకటించారు. అనంతరం తిరుమలలో పార్టీ శ్రేణులు సైతం పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన తిరుమలకు వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీవారి క్షేత్రానికి ఫ్యాన్ పార్టీ అధినేత రాకను నిరసిస్తూ కూటమి నేతలు, హిందూ సంఘాలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే గుడిలోకి అడుగుపెట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు వైసీపీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Big Breaking: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
AP-Karnataka: ఏపీ, కర్నాటక ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం.. ఏ విషయంలో అంటే
Anam Ramanarayana: సంతకం పెట్టాల్సిందే.. లేకపోతే అడుగుపెట్టనివ్వం