Share News

CM Chandrababu : అప్రమత్తంగా ఉండండి

ABN , Publish Date - Dec 01 , 2024 | 05:23 AM

బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

CM Chandrababu : అప్రమత్తంగా ఉండండి

  • సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తంకండి

  • ఫెంగల్‌ తుఫానుపై సీఎం సమీక్ష

అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్‌ టైమ్‌లో అంచనా వేసి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఫెంగల్‌ తుఫానుపై జిల్లా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ, సీఎంవో, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అధికారులతో సీఎం సమీక్షించారు. ‘తుఫాను పరిస్థితిని ఆర్టీజీఎస్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలి. అన్ని స్థాయిల్లో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, పూర్తి సమన్వయంతో పని చేయాలి. ఆకస్మిక వరదలు వస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సహాయ, పునరావాస కార్యక్రమాలకు కలెక్టర్లు సమాయత్తం కావాలి. ధాన్యం రైతులకు నిర్దిష్ట సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలి’ అని అధికారులను ఆదేశించారు.

  • అధికారులు అందుబాటులో ఉండాలి: అచ్చెన్న

తుఫాన్‌ నేపథ్యంలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని కోరారు. కాగా, తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Updated Date - Dec 01 , 2024 | 05:24 AM

News Hub