Share News

AP NEWS: విమాన ప్రయాణికులకు శుభవార్త

ABN , Publish Date - Dec 12 , 2024 | 10:05 AM

రాజమండ్రి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో అన్ని ఎయిర్ పోర్టుల నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు ఏటీఆర్ విమాన సర్వీసులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఎయిర్ బస్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

AP NEWS: విమాన ప్రయాణికులకు శుభవార్త

రాజమండ్రి: విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిరామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు చిరకాల కోరిక ఢిల్లీకి విమాన సర్వీసులు అందుబాటులోకి రావటం శుభ పరిణామమని అన్నారు. దేశ రాజదాని న్యూఢిల్లీ, వాణిజ్య రాజదాని ముంబైకి విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.


అందుబాటులోకి కొత్త సర్వీసులు ..

ఇవాళ రాజమండ్రిలో రామ్మోహన్ నాయుడు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... రాజమండ్రి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఏపీలో అన్ని ఎయిర్ పోర్టుల నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు ఏటీఆర్ విమాన సర్వీసులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఎయిర్ బస్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. మరో 50 ఎయిర్ పోర్టులు కొత్తగా నిర్మించాలని భావిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం నుంచి మరిన్ని పట్టణాలకు కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నట్లు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఢిల్లీ, తిరుపతి, వారాణసీ, షిర్డీ తదితర ప్రదేశాలకు మధురపూడి నుంచి కనెక్టివిటీ సర్వీసులు కలపాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. త్వరలోనే ఢిల్లీకి కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నామని కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.


దేశవ్యాప్త రాకపోకలకు సన్నద్ధం ..

కాగా.. రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇక్కడి నుంచే దేశవ్యాప్త రాకపోకలకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధికి రూ.250కోట్లు కేటాయించారు. దీంతో విమానాశ్రయ రూపురేఖలు మారిపోనున్నాయి. పనులు పూర్తయ్యేలోపు రాకపోకలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎక్కడికైనా ఇక్కడి నుంచి వెళ్లేలా విమానాశ్రయాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకూ 72 సీట్లతో విమానాలు నడుస్తున్నాయి. ఇక డిసెంబర్ 1 నుంచి 180 సీట్లు ఉన్న ఎయిర్‌బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటివరకూ రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు రోజూ అటూ ఇటూ 14 సర్వీసులు తిరుగుతున్నాయి. బెంగళూరుకు అటూ 4 సర్వీసులు ఉన్నాయి. చెన్నైకు ఒకసారి విమాన సర్వీసు వెళ్లి వస్తోంది. గతంలో విశాఖపట్నం నుంచి సర్వీసు ఉండేది. కానీ రోడ్డు మార్గాన 3గంటల్లో వచ్చేస్తుండటంతో ఎక్కువ మంది విమానం ఎక్కడానికి ఇష్టపడటంలేదు. దీంతో అది రద్దయింది. విమాన ప్రయాణికులు పెరిగితే అక్కడినుంచి కూడా విమాన సర్వీసులు మొదలవుతాయి. ఇక విజయవాడ, తిరుపతి ప్రయాణాలకు కొంత సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Google: ఏపీకి గూగుల్‌

YSRCP: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి జంప్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 10:47 AM