Amaravathi: రాజధానికి రూ.25 లక్షల విరాళం.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటన
ABN , Publish Date - Jun 22 , 2024 | 08:31 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఏపీ రాజధాని అమరావతికి(Amaravathi) విరాళాలు ఇవ్వడానికి రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థిని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు శనివారం విరాళం ఇచ్చారు.
అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఏపీ రాజధాని అమరావతికి(Amaravathi) విరాళాలు ఇవ్వడానికి రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థిని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు శనివారం విరాళం ఇచ్చారు. ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని(CM Chandrababu Naidu) కలిసి విరాళం అందించారు.
అమరావతి నిర్మాణానికి రూ.25 లక్షలు, పోలవరం ప్రాజెక్టుకు రూ.1 లక్ష చెక్కును చంద్రబాబుకి అందజేశారు. తమకున్న మూడు ఎకరాల భూమిలో ఎకరం పొలం అమ్మగా రూ.25 లక్షలు వచ్చాయని వాటిని రాజధానికి, తన బంగారు గాజులు అమ్మగా వచ్చిన రూ.లక్షను పోలవరానికి విరాళంగా అందించినట్లు వైష్ణవి తెలిపారు. 'రాజధానిని నిర్మిద్దాం - రాష్ట్రాన్ని అభివృద్ది చేద్దాం' అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తనవంతు సాయం చేస్తున్నట్లు ఆమె వివరించారు.
స్ఫూర్తి నింపారు: సీబీఎన్
అమరావతి నిర్మాణం కోసం పొలం అమ్మి విరాళం ఇవ్వడం గొప్ప విషయం అని సీఎం చంద్రబాబు అన్నారు. యువతకు వైష్ణవి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువత కలలు కూటమి ప్రభుత్వం నిజం చేస్తుందని బాబు స్పష్టం చేశారు. లాభాపేక్ష లేకుండా విరాళం ఇచ్చినందుకుగానూ శాలువా కప్పి ఆమెను సత్కరించారు.
స్ఫూర్తి నింపిన వైష్ణవిని రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వైష్ణవితోపాటు తండ్రి అంబుల మనోజ్‌ని సీఎం అభినందించారు. విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్‌లో వైష్ణవి ప్రస్తుతం ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు.
త్వరలో కడప పార్లమెంట్ ఉప ఎన్నిక..?
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..