Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్.. ఏం చర్చించారంటే..

ABN , Publish Date - Oct 29 , 2024 | 08:37 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఇవాళ(మంగళవారం) సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కపిల్‌దేవ్ చర్చించారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధితో పాటు అమరావతిలో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటుపై సీఎంతో కపిల్‌దేవ్ చర్చించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్.. ఏం చర్చించారంటే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఇవాళ(మంగళవారం) సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కపిల్‌దేవ్ చర్చించారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధితో పాటు అమరావతిలో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటుపై సీఎంతో కపిల్‌దేవ్ చర్చించారు. గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కపిల్ దేవ్ వెంట ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కెనినేని చిన్ని ఉన్నారు.


ఏపీని క్రీడా హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

లెజెండరీ క్రికెటర్ , ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా చైర్మన్ మిస్టర్ కపిల్ దేవ్, ఆయన ప్రతినిధి బృందంతో కీలక అంశాలపై చర్చించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌(ట్విట్టర్)లో సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ , అనంతపురం, వైజాగ్‌లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని విస్తరించడం గురించి తాము చర్చించామని తెలిపారు. ఇది ఏపీలోని యువతలో గోల్ఫ్ పట్ల మక్కువను పెంపొందిస్తుందని.. భవిష్యత్‌లో గోల్ఫ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా ఉన్న పౌరులకు ఇలాంటి మరిన్ని అవకాశాలు, సౌకర్యాలను కల్పించేందుకు ‘‘Go AP’’ కట్టుబడి ఉందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా నైపుణ్యానికి నిజమైన హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.


ఏపీలో గోల్ఫ్ క్రీడ అభివృద్ధికి అవకాశాలు:కపిల్ దేవ్

సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో కపిల్ దేవ్ మాట్లాడారు. క్రికెట్‌తో పాటు గోల్ఫ్‌తో తాను అసోసియేట్‌గా ఉన్నానని తెలిపారు. గోల్ఫ్ ఇండియాకు ప్రెసిడెంట్‌గా ఉన్నానని వివరించారు. సీఎం చంద్రబాబుతో క్రీడా సంబంధిత విషయాలు చర్చించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్రీడలను పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉందని అన్నారు. ఏపీలో గోల్ఫ్ క్రీడ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని... ఎక్కడ అవకాశం అంటే అక్కడ గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేస్తామని కపిల్ దేవ్ తెలిపారు.


ఆంధ్రాలో గోల్ఫ్‌ను ప్రమోట్ చేస్తున్నాం: ఎంపీ చిన్ని

ఆంధ్రాలో గోల్ఫ్‌ను ప్రమోట్ చేస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కెనినేని చిన్ని తెలిపారు. ముందు అనంతపురంలో ఆ తర్వాత అమరావతిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని వివరించారు. అనంతపురంలో కియా ఉద్యోగులు చాలామంది గోల్ఫ్ కోసం బెంగళూర్ వెళ్లి వస్తున్నారని అన్నారు. ఐపీఎల్ లాగా గోల్ఫ్‌ను కూడా ప్రీమియర్ లీగ్ టీమ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని తెలిపారు.కపిల్ దేవ్‌ను ఏపీకి స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడార్‌గా ఉండాలని కోరామని, ఆయన అంగీకరించారని ఎంపీ చిన్ని వెల్లడించారు.

Updated Date - Oct 29 , 2024 | 09:09 PM