Share News

Minister Nimmala: జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్లక్ష్యం.. మంత్రి నిమ్మల విసుర్లు

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:28 PM

జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్‌‌‌లో అత్యధిక శాతం కేటాయించిందని తెలిపారు.

 Minister Nimmala: జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్లక్ష్యం.. మంత్రి నిమ్మల విసుర్లు
Minister Nimmala Ramanaidu

నంద్యాల: జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్‌‌‌లో అత్యధిక శాతం కేటాయించిందని తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమకు అత్యంత కీలకమైన ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు అని వివరించారు. శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని గతంలో డ్యామ్ సేప్టీ కమిటీ నిపుణులు పాండ్యా అప్పటి ప్రభుత్వానికి తెలిపారని గుర్తుచేశారు.


రాయలసీమను నిర్లక్ష్యం చేశారు..

శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ అధ్యాయనానికి బడ్జెట్ కేటాయించాలని నిపుణులు కోరారని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం రూ. 16 కోట్లు కేటాయించలేకపోయిందని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడమంటే రాయలసీమను నిర్లక్ష్యం చేయడమేనని అన్నారు. సోమశిల ప్రాజెక్టు యాప్రాన్ కూడా దెబ్బతిందని ఇంజనీర్లకు చెప్పామన్నారు. యాప్రన్ పనులు చేయకపోతే సోమశిల ప్రాజెక్టు భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ వల్ల నష్టం జరగకుండా భద్రతకు చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

మరోవైపు.. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. ఏపీకి మంచి రోజులొచ్చాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం, జల హారతి ఇవ్వడం సంతోషమని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం ఎన్టీఆర్ కల అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.


జగన్ పాలనలో భయంతో బతికారు..

‘‘రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తెలుగు గంగ నుంచి చెన్నైకి నీళ్లు తీసుకెళ్లాలని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చెప్పారని గుర్తుచేశారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాను. కానీ మాజీ సీఎం జగన్ కేవలం రూ. 2వేల 11 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జగన్ పాలనలో జనం భయంతో బతికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనం స్వేచ్ఛగా ఉన్నారు. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాను. కానీ ఖజానా ఖాళీ అయింది. మరో రెండు, మూడు రోజుల్లో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయి. వరద నీరు సముద్రంలో కలవకుండా ప్రాజెక్టులకు తరలించేలా ప్రణాళికలు రూపొందించి రాయలసీమను రత్నాల సీమ చేస్తా.. ఇది సాధ్యం. వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్ల సీమగా మారింది. నీరు ఉంటే సంపద సృష్టిస్తాం. సంపద ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల పేదరికం పోతుంది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Updated Date - Aug 01 , 2024 | 05:29 PM