Raghurama: నన్ను దారుణంగా చిత్రవధ చేశారు..చంపాలని చూశారు
ABN , Publish Date - Dec 01 , 2024 | 09:43 PM
పీవీ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని కోరానని ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు అన్నారు. విధినిర్వాహణలో ఉన్నప్పుడే విదేశాలకు వెళ్లి ఉల్లాసంగా... ఉత్సాహంగా గోల్ఫ్ ఆడిన ఘనుడని ఎద్దేవా చేశారు. పీవీ సునీల్ కుమార్ ఎన్ని దేశాలకు వెళ్లాడో తెలుసుకోవడానికి ఆయన పాస్ పోర్ట్‌ను తనిఖీ చేయాలని కోరారు.
పశ్చిమగోదావరి: ప్రస్తుత ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఐడీ అదనపు మాజీ ఎస్పీ విజయ్ పాల్‌ను అరెస్ట్ చేశారు. మరికొంతమందిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసుపై మరోసారి రఘురామ షాకింగ్ కామెంట్స్ చేశారు. మతిమరుపు వచ్చినట్లుగా నటించేవారు మినహా..కస్టోడియల్ టార్చర్ కేసులో మిగతా వారంతా ఉన్నది ఉన్నట్లు చెప్పేశారని వ్యాఖ్యానించారు. కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తులో వేగం పుంజుకుందని... న్యాయం ఎప్పుడు జరుగుతుందన్నది తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ కేసులో నాల్గో నిండితుడైన విజయ్ పాల్‌కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించిందని.... ఆ మరుసటి రోజే పోలీసులు అరెస్ట్ చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో 5వ నిందితురాలు డాక్టర్ ప్రభావతి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారని అన్నారు. ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో తాను ఇంప్లిడ్ అవుతానని స్పష్టం చేశారు. కస్టడీలో తనను బాగానే చూసుకున్నారని ఇద్దరు వీఆర్వోల సమక్షంలో.. తాను స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తప్పుడు లెటర్ సృష్టించిన దగుల్బాజీలు వీరని మండిపడ్డారు. తాను అప్పుడే ఇదంతా ట్రాష్ అని డీఎస్పీ దిలీప్ కుమార్ ముందే రాసి సంతకం చేశానని అన్నారు. ప్రభావతికి కూడా మెమరీ లాస్ వస్తుందేమో? ఫుల్ మెమరీ ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని పోలీసులను కోరానని అన్నారు. విధినిర్వాహణలో ఉన్నప్పుడే విదేశాలకు వెళ్లి ఉల్లాసంగా... ఉత్సాహంగా గోల్ఫ్ ఆడిన ఘనుడని ఎద్దేవా చేశారు. పీవీ సునీల్ కుమార్ ఎన్ని దేశాలకు వెళ్లాడో తెలుసుకోవడానికి ఆయన పాస్ పోర్ట్‌ను తనిఖీ చేయాలని కోరారు. ప్రస్తుతం గుడివాడలో దందాలు నిర్వహిస్తున్న తులసీని ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. తన గుండెలపై 110 కేజీలు ఉన్న తులసీ కూర్చుంటే, ఆ బరువు తాళలేక మంచం కోళ్లు విరిగిపోయాయని చెప్పారు. పీవీ సునీల్ కుమార్ తన ఇంట్లో పని చేసే వాళ్లను, సొంత మనుషులతో తనను తుద ముట్టించాలని చూశారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.