Satya Kumar : హామీలపై ప్రశ్నిస్తే జగన్ ప్రభుత్వం దాడులు చేస్తుంది
ABN , Publish Date - Feb 26 , 2024 | 03:11 PM
జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలపై దాడులు చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్(Satya Kumar) అన్నారు. సోమవారం నాడు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరసరావుపేట బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణని సత్య కుమార్ పరామర్శించారు.

పల్నాడు జిల్లా: జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలపై దాడులు చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్(Satya Kumar) అన్నారు. సోమవారం నాడు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరసరావుపేట బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణని సత్య కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో అరాచక ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అల్లూరివారిపాలెంలో తమ కార్యకర్తలు ‘ప్రజా పోరు’ పేరుతో కరపత్రాలు పంపిణీ చేస్తుంటే.. వైసీపీ ఎంపీటీసీ వెంకటప్పారెడ్డి, జయ భారత్ రెడ్డి మరికొందరు వైసీపీ మూకలు దాడికి తెగబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.
కర్రలు, రాళ్లతో కార్యకర్తలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తమ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే, పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పాలని కేసు నమోదు చేయకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై ఎన్ని దాడులు చేస్తున్నా సరే.. కేసులు 10 శాతం కూడా నమోదు చేయడం లేదని అన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైసీపీ వర్గీయులు చిచ్చు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కేవలం ప్రతిపక్ష నాయకులపై దాడులు చేసి గెలవాలని జగన్‌రెడ్డి చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని దాడులు చేసినా బీజేపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేసు నమోదు చేయకపోతే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని మందలించారు. తమపై దాడులు ఆపకపోతే జగన్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోతారని.. ఈ విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని సత్య కుమార్ హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...