Rains Effect: ఇప్పటివరకూ 43,417మందిని రక్షించాం: ఏపీఎస్డీఎంఏ..
ABN , Publish Date - Sep 03 , 2024 | 11:45 AM
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ వరదల్లో చిక్కుకున్న 43,417మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ముంపు ప్రాంతాల్లో 197 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. సహాయక చర్యల్లో 48 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా సేవలు అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ వరదల్లో చిక్కుకున్న 43,417మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ముంపు ప్రాంతాల్లో 197 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. సహాయక చర్యల్లో 48 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా సేవలు అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
24గంటలపాటు పర్యవేక్షణ..
విజయవాడ ముంపు బాధితుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వరద బాధితులను రక్షించేందుకు వార్డుల వారీగా మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు నిమగ్నమైనట్లు చెప్పారు. విపత్తుల సంస్థలోని కంట్రోలో రూమ్ నుంచి 24గంటలపాటు 8మంది ఐఏఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో శరవేగంగా ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. 6 హెలికాప్టర్లు, పలు డ్రోన్స్ ద్వారా ఆహారం, నీరు, పాలు, పండ్లు, బిస్కెట్స్, మెడిసిన్ పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ప్రాథమిక అవసరాలు అందించేందుకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఎవరికైనా సహాయం అందకపోతే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇంకా అందని సాయం..
మరోవైపు ముంపు ప్రాంతాలైన విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీల్లో ప్రభుత్వం అందించే నిత్యావసరాలు అందడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరూ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదసాయం అందకపోవడంపై ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. సహాయక కార్యక్రమాలు కేవలం మెయిన్ రోడ్‌కే పరిమితం అవుతున్నాయని, కాలనీల లోపల నివసిస్తున్న వారికి భోజనం సహా ఎలాంటి సౌకర్యాలూ అందడం లేదని వాపోతున్నారు. రూ.5 ఉన్న బిస్కెట్ ప్యాకెట్‌కు వ్యాపారులు రూ.10నుంచి రూ.20వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల కట్టడిలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది అధికారులు వరద సహాయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికే సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తాను స్వయంగా పర్యటిస్తున్నా నిర్లక్ష్యం వీడడం లేదంటూ ఆగ్రహించారు. సీఎం చెప్పినటప్పటికీ అధికారుల తీరు మారడం లేదంటూ వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరువూరులో ఇదీ పరిస్థితి..
ఎదుళ్లవాగు వరద ఉద్ధృతికి తిరువూరు రూరల్ మండలం టేకులపల్లి సమీపంలోని వంతెనకు ఇరువైపులా గండ్లు పడ్డాయి. అలాగే టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి ఆరు అడుగుల మేర లోతుకు కోతకు గురైంది. దీంతో ఈ రెండు మార్గాల్లో రాకపోకలు ఐదు రోజులుగా నిలిచాయి. రాకపోకలు నిలిచిపోవడంతో చింతలపాడు, గానుగపాడు మీదుగా ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. తిరువూరు రూరల్ మండలం మల్లేల వద్ద వాగు ఉద్ధృతికి అలుగుపడి జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు అనుమతించారు. తిరువూరు -అక్కపాలెం రహదారిలో చెరువుల వరద ఉద్ధృతికి కరకట్ట, ప్రధాన రహదారికి గండ్లు పడ్డాయి. రహదారి పలు చోట్ల కోతకు గురైంది. దీంతో ఆంధ్రా- తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Prakasam Barrage: హమ్మయ్య..శాంతించిన కృష్ణమ్మ.. ఊపిరిపీల్చుకున్న ప్రజలు
Heavy Rains: పడవల ద్వారా ఆహారం సరఫరా.. కాసేపట్లో సింగ్‌నగర్‌కు చంద్రబాబు