Free Sand Scheme: సగం ధరకే ఇసుక..!
ABN , Publish Date - Jul 10 , 2024 | 01:26 AM
సామాన్యుడి కల నెరవేరుతోంది. ఇంటి నిర్మాణం కోసం గత ఐదేళ్లు పడ్డ కష్టానికి ఈ ప్రభుత్వంలో ఉపశమనం లభిస్తోంది. అతి తక్కువ ధరలో ఇసుక అందుబాటులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 8 స్టాక్ యార్డుల్లో ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించింది. పది చక్రాల లారీలో 20 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకు వెళ్లే వినియోగదారునికి రూ.12వేలకే ఇసుకు ఇంటికి చేరుతోంది. గత ప్రభుత్వంలో ఇదే లారీ ఇసుక ఇంటికి చేరేసరికి రూ.24వేలు అయ్యేది. ఉచిత ఇసుక మొదలైన తొలి రెండ్రోజుల్లోనే యార్డుల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి.
గత ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.24 వేలు
ప్రస్తుత ప్రభుత్వంలో రూ.12 వేలకే ఇంటికి..
ఎన్టీఆర్ జిల్లాలో నియంత్రణలోకి వచ్చిన రవాణా చార్జీలు
కీసర నుంచి విజయవాడకు పది చక్రాల లారీకి రూ.6 వేలు
ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఇంకా తక్కువ ధరకే..
భవానీపురం, గొల్లపూడిలలో స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తే విజయవాడ వాసులకు మరింత తక్కువ ధరకు..
ఇసుక స్టాక్ యార్డుల్లోని నిల్వలు వారం రోజుల వరకే
సామాన్యుడి కల నెరవేరుతోంది. ఇంటి నిర్మాణం కోసం గత ఐదేళ్లు పడ్డ కష్టానికి ఈ ప్రభుత్వంలో ఉపశమనం లభిస్తోంది. అతి తక్కువ ధరలో ఇసుక అందుబాటులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 8 స్టాక్ యార్డుల్లో ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించింది. పది చక్రాల లారీలో 20 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకు వెళ్లే వినియోగదారునికి రూ.12వేలకే ఇసుకు ఇంటికి చేరుతోంది. గత ప్రభుత్వంలో ఇదే లారీ ఇసుక ఇంటికి చేరేసరికి రూ.24వేలు అయ్యేది. ఉచిత ఇసుక మొదలైన తొలి రెండ్రోజుల్లోనే యార్డుల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి.
కూటమి ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.12వేలు
ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 8 ఇసుక యార్డుల్లో ఇసుక లభ్యమవుతుంది. వీటిలో కీలకమైనది కీసర యార్డు. ఇక్కడ టన్ను రూ.290 నామినల్ ధరకే ఇసుకను అందిస్తున్నారు. సగటున ఒక వినియోగదారునికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను అందిస్తున్నారు. ఈ లెక్కన 20 టన్నులకు కలిపి రూ.5800 ఖర్చు మాత్రమే అవుతోంది. ఈ 20 టన్నుల ఇసుకను తీసుకు వెళ్లే సామర్ధ్యం కలిగిన పది చక్రాల లారీకి సంబంధించి ట్రాన్స్‌పోర్టు ధర మరో రూ.5 వేల నుంచి రూ.6 వేలు అవుతుంది. ఈ లెక్కన గరిష్టంగా తీసుకున్నా 20 టన్నుల ఇసుక రూ.12,000కే లభిస్తోంది.
వైసీపీ పాలనలో లారీ ఇసుక రూ.24వేలు
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో టన్నుకు రూ.700 - రూ.800 వరకు స్టాక్ యార్డుల్లో వసూలు చేశారు. దీనికితోడు అధికారులకు, స్టాక్ యార్డుల్లో సిబ్బందికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇలా అన్ని ఖర్చులు కలిపితే రూ.1000 వరకు అయ్యేది. మొత్తం 20 టన్నుల ఇసుక రూ.20 వేలు అయ్యేది. రవాణా ఖర్చు రూ.6 వేలు కలిపితే రూ.24 వేల వరకు గరిష్టంగా ఇసుక ధర ఉండేది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గత ప్రభుత్వంలో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక పథకం వల్ల వినియోగదారులు సగం ధరకే ఇసుకను పొందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ప్రాంతంలోని వారైతే మరో 2 నుంచి 3 వేలు మినహాయింపు కూడా పొందుతున్నారు. బ్లాక్ మార్కెట్ తగ్గటం, ఎన్‌ఫోర్స్‌మెంట్ పెరగటం, జరిమానాల భయంతో రవాణా వాహనదారులు కూడా న్యాయబద్ధంగానే తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ప్రాంతంలో దగ్గరగా ఉండటం వల్ల ట్రాన్స్‌పోర్ట్ ధరల్లో ప్రయోజనాలు పొందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వచ్చే వాహనాలకు సగానికి సగం ప్రయోజనం దక్కుతుండటం విశేషం.
విజయవాడ సమీపంలో స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలి
విజయవాడ గ్రేటర్ విలీన జాబితా గ్రామాల్లో నిర్మాణరంగం ఎక్కువగా ఉంది. దీంతో ఇసుకకు డిమాండ్ ఉంది. విజయవాడ పరిసిర ప్రాంతాలైన భవానీపురం ప్రాంతంలో ఒక స్టాక్ యార్డును ఏర్పాటు చేయటం వల్ల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతతాయి. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు మరింత తక్కువ ధరకే ఇసుక దక్కుతుంది. విజయవాడ ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణం భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు ఇసుక స్టాక్‌యార్డులను కేటాయించాల్సిన అవసరం ఉంది.
స్టాక్ మరో వారానికే..
ప్రస్తుతం స్టాక్‌యార్డుల్లో ఉన్న ఇసుక నిల్వలు మరో వారం రోజుల వరకే అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. మంగళవారం జిల్లాలోని 8 స్టాక్ యార్డుల్లో వాహనాలు పోటెత్తాయి. క్షణం కూడా ఖాళీ లేకుండా వాహనాల రాకపోకలు సాగాయి. జిల్లాలో అత్యధికంగా 2 లక్షల టన్నుల వరకు కీసర స్టాక్‌యార్డులోనే నిల్వలు ఉన్నాయి. మిగిలినచోట్ల చాలా తక్కువగా ఉంది. మరో మూడు రోజుల్లో వీటిలో ఇసుక అయిపోయే అవకాశం ఉంది. కీసరలో ఉన్న నిల్వలు మరో వారం రోజులకు మాత్రమే సరిపోతాయి. జిల్లా యంత్రాంగం తక్షణం ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను తోడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.
కీసర వద్ద టన్ను రూ.290 మాత్రమే
కంచికచర్ల : వైసీపీ పాలనలో కీసర స్టాక్ యార్డు టన్ను రూ.675 నుంచి రూ.800 వరకు తీసుకున్నారు. ట్రాక్టర్ ట్రక్కుకు 4.5 టన్నులు పడుతుంది. దీనికి రవాణా ఖర్చు కలుపుకుంటే రూ.5వేలకుపైగా ధర అవుతోంది. ఇప్పుడు యార్డుకు అయిన రవాణా ఖర్చు, లోడింగ్, సీనరేజ్, ఇతరత్రా పన్నులు కలిపి టన్నుకు కేవలం రూ.290 తీసుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుక రూ.1305 అవుతోంది. ప్రస్తుతం కంచికచర్లలో ట్రాక్టరు ఇసుక రూ.2వేల నుంచి రూ.2500 (యార్డు నుంచి రవాణా కలుపుకుని) పడుతోంది. యార్డు వద్ద ఇసుక కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నందున రవాణాకు కిరాయి ఎక్కువ తీసుకుంటున్నారు. మున్ముందు ఈ ధర ఇంకా తగ్గుతుంది.
వైసీపీ పాలనలో ఇంటి నిర్మాణం ఆగిపోయింది
వైసీపీ పాలనలో ఇసుక కోసం పడిన బాధలు వర్ణనాతీతం. ఒక దశలో పది వేలు ఇస్తామన్నా ట్రక్కు ఇసుక కూడా దొరకలేదు. గత్యంతరం లేక ఇంటి పనులు ఆపేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇవ్వడం సంతోషంగా ఉంది.
-జూలూరు విశ్వనాథం, కంచికచర్ల