Share News

Minister Anam: కూటమి ప్రభుత్వంలో నవహారతుల పునరుద్ధరణకు చర్యలు

ABN , Publish Date - Aug 13 , 2024 | 01:07 PM

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanaraya Reddy) తెలిపారు. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద మళ్లీ నవ హారతులను ప్రారంభిస్తామని తెలిపారు.

Minister Anam: కూటమి ప్రభుత్వంలో నవహారతుల పునరుద్ధరణకు చర్యలు

అమరావతి: ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanaraya Reddy) తెలిపారు. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద మళ్లీ నవ హారతులను ప్రారంభిస్తామని తెలిపారు. 2019కి ముందు వరకు నవహారతులు కొనసాగాయని వివరించారు. వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తుల కోసం ఆనాడు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక హారతులు నిలిపివేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో హారతుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పవిత్ర సంగమం ఘాట్‌ను మంగళవారం నాడు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, కొలుసు పార్థసారధి పరిశీలించారు.


అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించి మంత్రులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ... 45 రోజుల సమయం పెట్టుకుని ఇక్కడ హారతులను పునరుద్ధరిస్తామని చెప్పారు. పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు. దసరా ఉత్సవాల నాటికి హారతులు ప్రారంభం అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కృష్ణమ్మ హారతులతో పాటు, ఆలయం నిర్మాణం కూడా పూర్తిచేస్తామని వివరించారు. మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తామని తెలిపారు. యాభై ఎకరాల భూమిని ఆలయం కోసం సేకరించాలని గతంలో చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు అది అమల్లోకి తీసుకువచ్చి పని చేస్తామని అన్నారు. లంక భూములను కూడా నదికి అటువైపు అభివృద్ధి చేస్తామని తెలిపారు. నదుల సంగమానికి ప్రతీకగా ఎలాంటి ఆలయం కావాలో చర్చిస్తామని తెలిపారు.


ఎలాంటి ఆలయాలు అనే దానిపై వేదిక కమిటీ సభ్యులతో చర్చిస్తామని అన్నారు. అన్ని అంశాలు సీఎంకి వివరించి పనులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ‌ పవిత్ర సంగమం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే పుణ్య, ‌పర్యాటక కేంద్రంగా మారుస్తామని వెల్లడించారు. హారతుల నిర్వహణకు నెలకు రూ.11లక్షలు అవుతుందని చెప్పారు. మరోసారి కమిటీతో కూర్చుని ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ప్రాంతం ‌ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హారతుల పునరుద్ధరణకు సీఎం ఆదేశించారని అన్నారు. అన్ని శాఖల అధికారులతో దీనిపై సమీక్ష చేశారని అన్నారు. మేజర్‌గా సీఆర్డీఏ నుంచి నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇతర శాఖల వారిగా బడ్జెట్ ప్రకారం పనులు చేస్తామని వెల్లడించారు. మున్సిపాలిటీ తరపున శానిటేషన్ చూస్తారని చెప్పారు. ఇక్కడ మంచి ఆలయం కూడా నిర్మిస్తామని అన్నారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పనులు చేపడతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.


ఘాట్ ఎత్తు పెంచాలి: మంత్రి పార్థసారధి

parthasarati.jpg

ఈ ప్రాంతం ఐకానిక్ ప్రదేశంగా మారే అవకాశం ఉందని మంత్రి పార్థసారధి తెలిపారు. హారతులతో పాటు ఒక ఆలయ నిర్మాణం చేయాలని అన్నారు. పుణ్యక్షేత్రం కారణంగా నిత్యం భక్తుల రద్దీ పెరుగుతుందని చెప్పారు. వరదల సమయంలో తట్టుకునేలా ఘాట్ ఎత్తు పెంచాలని అధికారులను ఆదేశించారు. బోటింగ్ స్పోర్ట్స్ పెడితే ప్రజలను ఆకట్టుకోవచ్చని వివరించారు. నదికి ఇరువైపులా అభివృద్ధి చేస్తే మంచి‌ పర్యాటక ప్రదేశం అవుతుందని చెప్పారు. ఆధ్యాత్మికం, హాలిడే స్పాట్ వల్ల ప్రజలు కూడా ఆదరిస్తారని అన్నారు. గత ప్రభుత్వం ఈ ఘాట్‌ను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ఇప్పుడు కోట్ల రూపాయలతో మళ్లీ పనులు చేయాల్సి వస్తుందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 01:10 PM