Share News

Prakasam Barrage: హమ్మయ్య..శాంతించిన కృష్ణమ్మ.. ఊపిరిపీల్చుకున్న ప్రజలు

ABN , Publish Date - Sep 03 , 2024 | 11:01 AM

Andhrapradesh: భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్తశాంతించింది. గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 11 లక్షల 40 వేల నుంచి గంట గంటకు తగ్గుతూ వరద తాకిడి తగ్గుముఖం పడుతోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 8 లక్షల 94 వేలకు వరద చేరుకుంది.

Prakasam Barrage: హమ్మయ్య..శాంతించిన కృష్ణమ్మ.. ఊపిరిపీల్చుకున్న ప్రజలు
Prakasam Barrage

విజయవాడ, సెప్టెంబర్ 3: భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది. గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి (Prakasam Barrage) వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 11 లక్షల 40 వేల నుంచి గంట గంటకు తగ్గుతూ వరద తాకిడి తగ్గుముఖం పడుతోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 8 లక్షల 94 వేలకు వరద చేరుకుంది. కృష్ణమ్మ శాంతించడంతో బ్యారేజి దిగువన ఉన్న గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పలు గ్రామాలను వరద ముంపు వెంటాడుతోంది.


మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గటంతో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగాయలంక, శ్రీరామపాద క్షేత్రం ఘాట్ వద్ద అడుగు మేర వరద నీటిమట్టం తగ్గింది. కరకట్టకు సమాంతరంగా నీరు ప్రవహించడంతో నదీ తీర గ్రామాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తాగునీరు, ఆహారం సరఫరా చేయాలంటూ కోరుతున్నారు.


బుడమేరు సైతం...

ఇటు... ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకూ మహోగ్రరూపం చూపించిన బుడమేరుకు ఇవాళ వరద ఉధృతి కాస్త తగ్గింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. కుంభవృష్టి నమోదు కావడంతో బుడమేరు మహాగ్రరూపం దాల్చింది. ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లను వరద ముంచెత్తింది. 48 గంటలుగా సుమారు 2 .59 లక్షల మంది ప్రజానీకం వరద నీటిలోనే ఉండిపోయింది. చివరి వరకూ వారికి ప్రభుత్వ సహాయక చర్యలు అందలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా మకాం వేసినా కూడా చివరి వరకు సహాయం చేరలేదు. బుడమేరులో ప్రస్తుతం, 6 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉంది. ఇది మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

నా జనం ఏమయ్యారు?

Heavy Rains: పడవల ద్వారా ఆహారం సరఫరా.. కాసేపట్లో సింగ్‌నగర్‌‌కు చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 03 , 2024 | 11:27 AM