Supreme Court: నందిగం సురేష్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:30 PM
Andhrapradesh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు (YSRCP Former MP Nandigam Suresh) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగంకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పైన ఈరోజు (శుక్రవారం) జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు జనవరి 7కు వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సురేష్ తరపు న్యాయవాది, సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్ చేసిన అభ్యర్థిత్వాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
ఫార్ములా ఈరేస్ కేసుపై కేటీఆర్ ఏమన్నారంటే
ఈ కేసులో ప్రధానంగా మూడు అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో ఇంకా చార్జ్‌షీట్ దాఖలు చేయలేదని, అలాగే సురేష్ అరెస్ట్ అయి 90 రోజులు కాలేదు కాబట్టి బెయిల్‌కు సంబంధించి తామేమీ నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. అలాగే గతంలో మాజీ ఎంపీపై నమోదైన కేసు వివరాలను బెయిల్ పిటిషన్‌లో నమోదు చేయకపోవడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. 2020లో ఈ కేసు నమోదు అవగా.. అప్పటి ప్రభుత్వం ఎందుకు విచారణ జరపలేదని, విచారణ జరిపి ఉంటే తన నిర్దోషిత్వం బయటపడుండేది కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
కాగా.. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్‌ను దూషించారు. ఈ క్రమంలో అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో మరియమ్మ మరణించింది. అయితే దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితి. ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరియమ్మ కుమారుడు.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి మరియమ్మ మృతి గురించిన వివరాలను, తాము ఇచ్చిన ఫిర్యాదును తెలియజేశారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. దాంతో నందిగం సురేష్‌తో సహా ఆయన అనుచరులపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో హైకోర్టులోనూ నందిగం సురేష్‌కు ఊరట దక్కలేదు. హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేశారు సురేష్. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో చార్జిషీటు ఫైల్ అయిన తరువాత బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. మెరిట్స్ పైన వాదించడానికి నందిగం సురేష్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను జనవరి 7కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జనవరి 7న దీనిపై తుది విచారణ వింటామని ఆ తరువాత తీర్పు ఇస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి...
అది చంద్రబాబుతోనే సాధ్యం: భువనేశ్వరి
Read Latest AP News AND Telugu News