Minister Nadendla: రైతులు కంగారు పడి వారి చేతిలో మోసపోవద్దు: మంత్రి నాదెండ్ల..
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:12 PM
గత వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించినట్లు మంత్రి నాదెండ్ల మహోహర్ తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్లల్లో ఆనందం కనపడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలబడేందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలులో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసిందని ఆయన ఆగ్రహించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం చంద్రబాబు సర్కారే చెల్లించినట్లు నాదెండ్ల వెల్లడించారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్లల్లో ఆనందం కనపడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలబడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్షల కోట్ల బడ్జెట్ వృథాగా మారుతుందని ఆయన చెప్పారు. అందుకే వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. " ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తారు. వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గతేడాది ఈ సమయానికి శ్రీకాకుళం జిల్లాలో 7,217 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వంలో 1.15 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. రూ.253 కోట్లు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. అలా ఆందోళన చెంది దళారులకు తక్కువ ధరకే విక్రయించకండి. మీకు కనీస మద్దతు ధర దక్కాల్సిందే. అందుకు ప్రభుత్వం అన్నీ చర్యలు చేపట్టింది. ధాన్యంలో తేమ 20 శాతం వరకు ఉన్నా కొనుగోలు చేస్తున్నాం. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చాం. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాం. కాబట్టి వారంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. రైతులను ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
YSRCP: వైసీపీ నేతలు ఇక మారరా.. అసత్య ప్రచారాల్లో అగ్రస్థానం
Somuveeraju: పేరెంట్ టీచర్ మీటింగ్‌ను గొప్పగా కొనియాడిన సోమువీర్రాజు