Osamu Suzuki : సుజుకీ అధినేత ఒసాము సుజుకీ కన్నుమూత
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:06 AM
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) డైరెక్టర్, గౌరవ చైర్మన్ ఒసాము సుజుకీ (94) మరిక లేరు.
మారుతి సుజుకీ ఏర్పాటులో కీలక పాత్ర
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) డైరెక్టర్, గౌరవ చైర్మన్ ఒసాము సుజుకీ (94) మరిక లేరు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం కన్నుమూసినట్టు ఎస్‌ఎంసీ ప్రకటించింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధిలోనూ ఆయనది కీలక పాత్ర. లైసెన్స్ రాజ్ హయాంలో ఏ విదేశీ ఆటోమొబైల్ కంపెనీ మన దేశంలో తన కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సాహసించేది కాదు. అలాంటి సమయంలో ఒసాము సుజుకీ.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి 1981లో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేశారు. భారత్‌లో కార్ల మార్కెట్‌కు ఉన్న అవకాశాలను ముందే ఊహించి సుజుకీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు. 2007లో ప్రభుత్వ వాటాను పూర్తిగా కొనుగోలు చేయడం ద్వారా మారుతి ఉద్యోగ్ పూర్తిగా సుజుకీ మోటార్ కార్పొరేషన్ పరమైంది. దాంతో కంపెనీ పేరూ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌ఐఎల్)గా మారింది. ఈ కంపెనీకి ఆయన చాలా కాలం పాటు డైరెక్టర్‌గా, గౌరవ చైర్మన్‌గా సేవలు అందించారు.
ముందు చూపున్న నేత: ఒసాము సుజుకీ మృతి పట్ల మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఆర్‌సీ భార్గవ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ముందు చూపుతో ఆయన రిస్క్ తీసుకుని ఉండకపోతే భారత ఆటోమొబైల్ రంగం ఈ రోజు ఈ స్థాయికి ఎదిగి ఉండేది కాదు’ అని నివాళులు అర్పించారు. మన దేశమంటే ఆయనకు ఎంతో ప్రేమ అన్నారు. భారత-జపాన్ సంబంధాల అభివృద్ధికీ సుజుకీ ఎంతో కృషి చేశారన్నారు. ఇందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.
విప్లవాత్మక మార్పులు
1981 వరకు మన దేశ కార్ల మార్కెట్లో సీకే బిర్లా గ్రూప్ కంపెనీ హిందూస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసే అంబాసిడర్ కార్లదే హావా. మారుతి ఉద్యోగ్ విడుదల చేసిన ‘మారుతి 800’ కార్లతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక సంస్కరణల తర్వాత అనేక దేశ, విదేశీ కంపెనీలు రంగంలోకి వచ్చినా, ఇప్పటికీ మార్కెట్లో అగ్రస్థానం మారుతి సుజుకీదే. మారుతున్న టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ విడుదల చేస్తూ కంపెనీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిన విద్యుత్ వాహనాల ఉత్పత్తిపైనా ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతోంది. నాటి ప్రధాని ఇందిరతో పాటు నేటి ప్రధాని మోదీతోనూ ఒసాము సుజుకీ సత్సంబంధాలు నడిపారు. ఆయన మృతి పట్ల భారత ఆటోమొబైల్ పరిశ్రమ దిగ్గజాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.