Health Tips: ఫ్రీగా వస్తున్నా.. 90 శాతం మందిలో ఈ విటమిన్ లోపం..
ABN , Publish Date - Dec 27 , 2024 | 08:34 PM
తిన్న తర్వాతా నీరసంగా అనిపిస్తోందా.. సరిగా నిద్ర పట్టటం లేదా.. ఎక్కువగా జుట్టు ఊడటం.. తరచూ మూడ్ మారిపోవటం, రోగాల బారిన పడటం ఎముకల బలహీనత, నిస్సత్తువ మిమ్మల్ని వేధిస్తోందా.. ఎంత పర్‌ఫెక్ట్ డైట్ మెయింటెయిన్ చేసినా అలసటగా అనిపిస్తోందా. అయితే, అందుకు ఇదే కారణం కావచ్చు..
తిన్న తర్వాతా నీరసంగా అనిపిస్తోందా.. సరిగా నిద్ర పట్టటం లేదా.. ఎక్కువగా జుట్టు ఊడటం.. తరచూ మూడ్ మారిపోవటం, రోగాల బారిన పడటం ఎముకల బలహీనత, నిస్సత్తువ మిమ్మల్ని వేధిస్తోందా.. ఎంత పర్‌ఫెక్ట్ డైట్ మెయింటెయిన్ చేసినా అలసటగా అనిపిస్తోందా. బహుశా, అది డి- విటమిన్ లోపం వల్లే కావచ్చు. ఎందుకంటే, ఇంటాబయటా ఎక్కడున్నా ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం అందరికీ బాగా అలవాటైపోయింది. దానికి తోడు చర్మసంరక్షణ కోసం రాసుకునే సన్‌స్క్రీన్ లోషన్లు విటమిన్ డి అందకుండా అడ్డుకుంటాయి. దీంతో ఏడాది పొడుగునా ఎండ కాస్తున్నా భారతీయుల్లో 90 శాతం మంది విటమిన్ డి లోపం సమస్య ఎదుర్కొంటున్నారు. రోగనిరోధకశక్తి తక్కువై నిత్యం అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్ర మానసిక, శారీరక మానసిక ఒత్తిడికి లోనవుతూ మనశ్శాంతికి దూరమవుతున్నారు. ఇది ఎముకలు, కండరాల బలహీనత, గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి, ఇన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా ఎందుకిలా అవుతోందనే ఆందోళనతో ఆస్పత్రులకు పరుగెట్టకుండా.. అందుకు రోజూ ఎండలో ఎక్కువగా గడపకపోవడమే కారణమేమో ఓసారి ఆలోచించుకోండి..
పైకి వేరే జబ్బుల లక్షణాల్లా కనిపిస్తున్నా విటమిన్ డి లోపం చాపకింద నీరులా మీ శరీరాన్ని గుల్ల చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం గంటసేపైనా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోండి. ఎందుకంటే, సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో తయారయ్యే ఏకైక విటమిన్ ఇదే. శరీరంలోని కొలెస్ట్రాల్ సూర్యకాంతిలో సమక్షంలో తయారవుతుంది కాబట్టే, దీనికి ఫ్రీ విటమిన్ అనే ముద్దు పేరూ ఉంది. రోగనిరోధకశక్తి పెంచి అనారోగ్యాలు దరిచేరకుండా చేయటం, నిత్యం ఉత్సాహంగా ఉండేలా చూడటంలో విటమిన్ డి పాత్ర కీలకం. ఇది గనక లోపిస్తే మీరు ఎంత కచ్చితమైన డైట్ పాటించినా నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. మానసిక ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు మిమ్మల్ని కుంగదీస్తాయి.
బిజీలైఫ్, కాలుష్యానికి భయపడి ఎండలోకి రాకుండా ఉండిపోయేవారూ ఎక్కువే. అయితే, అలాంటి వారు విటమిన్ డి సమస్య నుంచి తప్పించుకోవడమోలా అని చింతించాల్సిన పనిలేదు. ఈ కింది జాగ్రత్తలు పాటించి విటమిన్ డి లోపాన్ని దూరం చేసుకోవచ్చు.
కొవ్వు చేప
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ చేపలు సూర్యరశ్మికి గురికావడం వల్ల వీటి శరీరంలో విటమిన్ డి నిల్వ ఉంటుంది. వీటిని కనీసం వారానికి రెండు సార్లు తినడం ద్వారా విటమిన్ డి తగినంత మొత్తంలో అందుకోవచ్చు. ఇంకా ఉప్పునీటి చేపలు, కాలేయంలోనూ విరివిగా లభిస్తుంది.
పాల ఉత్పత్తులు
పాలు, పెరుగు మరియు చీజ్ వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ డి ఉంటుంది. కాబట్టి, మీ డైట్‌లో వీటిని భాగం చేసుకుంటే మంచిది.
గుడ్డు పచ్చసొన
తరచూ గుడ్డు పచ్చసొన తినడం వల్ల విటమిన్ డి లోపం నివారించవచ్చు.
పుట్టగొడుగు
సూర్యకాంతిలో పెరిగిన పుట్టగొడుగులలో విటమిన్ డి అధికంగా ఉంటుంది.
ఇప్పుడు విటమిన్ డి కలిపిన పాలు, తృణధాన్యాలతో చేసిన పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం. అయితే, నిజానికి ఆహార పదార్థాల కంటే సూర్యరశ్మిలో గడిపినప్పుడే విటమిన్ డి ఎక్కువ మొత్తంలో తయారవుతుంది. కాబట్టి, ఎండ ద్వారానే విటమిన్ డి లోపం నివారించేందుకు ప్రయత్నించండి.