Share News

Amit Shah: పీవోకేని భారత్‌లో కలుపుతాం!

ABN , Publish Date - May 16 , 2024 | 03:17 AM

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పీవోకేని తిరిగి భారత్‌లో కలుపుతామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని సిరాంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. 370 అధికరణం రద్దు తర్వాతే జమ్ము కశ్మీర్‌లో శాంతి పవనాలు వీస్తున్నాయని, స్వేచ్ఛా నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు.

Amit Shah: పీవోకేని భారత్‌లో కలుపుతాం!
Amit Shah

  • పాక్‌ దగ్గర అణు బాంబులున్నా వెనక్కి తగ్గేదేలేదు.. చేసి తీరుతాం

  • ఆ ప్రాంతం ఈ దేశంలో భాగం

  • కేంద్ర హోం మంత్రి షా ప్రకటన

న్యూఢిల్లీ, మే 15: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పీవోకేని తిరిగి భారత్‌లో కలుపుతామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని సిరాంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. 370 అధికరణం రద్దు తర్వాతే జమ్ము కశ్మీర్‌లో శాంతి పవనాలు వీస్తున్నాయని, స్వేచ్ఛా నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు. 2019లో తమ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు ఈ రాష్ట్రంలో నిత్యం రాళ్లదాడులు జరిగేవని చెప్పారు. ఇప్పుడు రాళ్ల దాడులు పాకిస్థాన్‌ ఆక్రమిక కశ్మీర్‌ వరకే పరిమితమయ్యాయని తెలిపారు. ‘‘పీవోకే భారత్‌లో భాగం అవునా? కాదా?’’ అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. పీవోకే భారత్‌లో భాగమని, దీనిని తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఇదేసమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌ దగ్గర అణుబాంబులు ఉన్నాయని.. కాబట్టి పాకిస్థాన్‌ జోలికి వెళ్లవద్దన్న మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘‘పాక్‌ దగ్గర అణు బాంబులు ఉన్నాయని వారు(కాంగ్రెస్‌) భయపడుతున్నారు. అయినప్పటికీ పీవోకేను వెనక్కి తీసుకుంటాం. పీవోకే భారత్‌లో భాగం. దీనిని ఖచ్చితంగా తిరిగి తీసుకుంటాం’’ అని షా నొక్కి చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ప్రజలు జీహాద్‌కు ఓటు వేస్తారో, అభివృద్ధికి ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలన్నారు.


జ్ఞాన్‌వాపీలో ఆలయం

మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ కూటమికి 400 సీట్లకు పైగా వస్తే పీవోకేను భారత్‌లో విలీనం చేస్తామని ప్రకటించారు. జార్ఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మిస్తామని, జ్ఞానవాపీలోనూ ఆలయ నిర్మాణం తథ్యమని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిని కూడా అమలు చేయనున్నట్టు తెలిపారు. ‘‘2019లో కేవలం 300 సీట్లు దాటినప్పుడే అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాం. ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. సీఏఏని అమలు చేశాం. 400 సీట్ల మార్కు దాటితే మరిన్ని చేస్తాం’’ అని సీఎం బిశ్వశర్మ అన్నారు.


సీఏఏ కింద తొలిసారి 14మందికి భారతీయ పౌరసత్వం

న్యూఢిల్లీ, మే 15: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం- 2019 (సీఏఏ) అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి 14 మందికి భారతదేశ పౌరసత్వం లభించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో 14 మందికి తొలి విడతగా.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా ఢిల్లీలో బుధవారం సీఏఏ కింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. దేశంలో సీఏఏ అమలులోకి వచ్చిన దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 11న కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, 2019 డిసెంబరులో ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనల నడుమ పార్లమెంటు ఉభయ సభల్లో ఈ చట్టం ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి సమ్మతితో అమల్లోకి వచ్చింది. సీఏఏ ప్రకారం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. 2014 డిసెంబరు 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన హిందూవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవ శరణార్థులకు ఇది వర్తిస్తుంది.

Updated Date - May 16 , 2024 | 10:23 AM